Begin typing your search above and press return to search.

కేంద్రం నిర్ణ‌యా‌ల‌పై ఏం చేద్దాం: ‌సీఎం కేసీఆర్ ఏడు గంట‌ల పాటు స‌మీక్ష‌

By:  Tupaki Desk   |   4 May 2020 3:30 AM GMT
కేంద్రం నిర్ణ‌యా‌ల‌పై ఏం చేద్దాం: ‌సీఎం కేసీఆర్ ఏడు గంట‌ల పాటు స‌మీక్ష‌
X
కేంద్రం మూడోసారి లాక్‌డౌన్ విధించింది. రాష్ట్రంలో 7వ తేదీతో ముగుస్తున్న లాక్‌డౌన్ నేప‌థ్యంలో కేంద్రం పొడిగించ‌డంతోపాటు భారీగా స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ఏం చ‌ర్య‌లు తీసుకుందాం.. రాష్ట్రంలో అమ‌లు చేద్దామా? వ‌ద్దా? మ‌ద్యం దుకాణాలపై ఏం చేద్దాం.. వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు ఎలా వంటి అంశాల‌పై ముఖ్యమంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు ఆదివారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. చాలా రోజుల త‌ర్వాత సుదీర్ఘ స‌మ‌యం పాటు సీఎం కేసీఆర్ స‌మీక్ష చేయ‌డం గ‌మ‌నార్హం. ప్రగతి భవన్‌లో నిర్వ‌హించిన స‌మావేశం దాదాపు ఏడు గంట‌ల పాటు కొన‌సాగి అర్థ‌రాత్రి ముగిసింది. దీంతో ఎలాంటి ప్రెస్‌మీట్ నిర్వ‌హించ‌కుండానే ముగించారు.

ఈ స‌మావేశంలో చాలా అంశాల‌కు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా గ‌తంలో ప్ర‌క‌టించిన‌ట్టు ఈ నెల 5వ తేదీన మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశంలో ఎలాంటి అంశాలు చర్చించాలి.. ఏం నిర్ణ‌యాలు తీసుకోవాల‌నే విష‌య‌మై చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ స‌మ‌యంలో మందుబాబుల‌కు ఊర‌టనిచ్చేలా ఓ నిర్ణ‌యం తీసుకుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. బీర్ల ఉత్ప‌త్తిని సోమ‌వారం నుంచి ప్రారంభించాల‌ని మౌఖిక ఆదేశాలు జారీ చేసిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో రాష్ట్రంలోని 6 బేవ‌రేజెస్‌లో బీర్ల ఉత్పత్తులు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. మ‌ద్యం విక్ర‌యించాల వ‌ద్దా అనే విష‌య‌మై తీవ్ర చ‌ర్చ సాగి చివ‌ర‌కు ఏ నిర్ణ‌యం తేల్చ‌కుండానే ముగించారంట‌. కేంద్రం మ‌ద్యం విక్ర‌యాలకు అనుమ‌తి ఇవ్వ‌డం.. 4వ తేదీ నుంచి మ‌ద్యం దుకాణాలు తెర‌వాల‌ని నిర్ణ‌యించ‌డంతో ఏం చేద్దామ‌ని చ‌ర్చించారు.


వీటితో పాటు రాష్ట్రంలో క‌రోనా కేసులు పెర‌గ‌డం.. లాక్‌డౌన్ అమ‌లు.. కేంద్రం తాజాగా ఇచ్చిన ఆదేశాల‌పై ఏం చేద్దామ‌నే విష‌యంపై ప్ర‌ధానంగా చ‌ర్చ సాగించారు. అయితే ఈ స‌మావేశంపై ప్ర‌జ‌లంద‌రూ తీవ్ర ఆస‌క్తిగా గ‌మ‌నించారు. ఎందుకంటే సీఎం కేసీఆర్ మ‌ద్యం విక్ర‌యాల‌పై ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని మందుబాబులు ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు.. అక్క‌డ‌క్క‌డ రాష్ట్రంలో వ‌ల‌స కార్మికులు ఆందోళ‌నలు చేయ‌డంతో అవి కూడా చ‌ర్చ‌కు వ‌చ్చాయ‌ని స‌మాచారం. వీటితో పాటు రాష్ట్రం వ్య‌వ‌సాయోత్ప‌త్తుల కొనుగోళ్లు.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు వంటి వాటిపై తీవ్రంగా చ‌ర్చించార‌ని వెల్ల‌డైంది. అయితే సీఎం కేసీఆర్ 5వ తేదీన మంత్రివ‌ర్గం స‌మావేశం అనంత‌రం మాత్ర‌మే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది.