Begin typing your search above and press return to search.

తెలంగాణ కరోనా నుంచి బయటపడే రోజు దగ్గరకు వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   5 May 2020 1:47 PM GMT
తెలంగాణ కరోనా నుంచి బయటపడే రోజు దగ్గరకు వచ్చేసిందా?
X
కరోనా నిర్దారణ పరీక్షలు పెద్దగా చేయకున్నా.. పాజిటివ్ గా నమోదవుతున్న కేసులు తెలంగాణలో తక్కువగా నమోదవుతున్నాయి. సోమవారం విషయానికే వస్తే.. కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ మూడు కేసులు కూడా హైదరాబాద్ మహానగరానికి చెందినవే కావటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 1085 నమోదైతే.. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 471 మాత్రమే. మరో పది రోజుల వ్యవధిలో ఈ కేసుల్లోని సగానికి పైగా కేసులు డిశ్చార్జి కానున్నాయి.

ఈ లెక్కన చూస్తే.. మే రెండో వారం పూర్తి అయ్యే నాటికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య నామమాత్రంగా మారే వీలుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. కరోనా కోరల్లో నుంచి రాష్ట్రం బయటపడినట్లేనని చెప్పక తప్పదు. తెలంగాణలో ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో అత్యధికం హైదరాబాద్ మహానగరం లోనివే. తెలంగాణలోని మెజార్టీ జిల్లాల్లో కరోనా కేసులు లేని నేపథ్యంలో.. లాక్ డౌన్ ఎత్తివేత విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు సాగుతోంది.

తెలంగాణ రాష్ట్రం మొత్తం హైదరాబాద్ నగరంతో ఉన్న లింకు తెలిసిందే. నిత్యం రాష్ట్ర రాజధానితో ఉండే సంబంధాల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. లాక్ డౌన్ ను సడలించిన పక్షంలో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు పెరుగుతాయని.. అదే జరిగితే వైరస్ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని చెబుతున్నారు.

లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్న తీరుతోనే కరోనా పాజిటివ్ కేసుల నమోదు తక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం.. ఏప్రిల్ మూడో వారంలో పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటంతో.. వారు డిశ్చార్జి అయితే.. కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని చెబుతున్నారు. గడిచిన వారంలో ఒకట్రెండు రోజులు మినహా మిగిలిన రోజుల్లో పాజిటివ్ కేసులు పెద్దగా నమోదైంది లేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పై ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా కరోనాను కట్టడి చేయటమే కాదు.. వైరస్ మహమ్మారి నుంచి బయటపడే (పూర్తిగా కాదు కానీ) అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.