Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ తెలంగాణ లో ఆ నూనెను అంతలా తాగేశారట

By:  Tupaki Desk   |   5 May 2020 6:30 PM GMT
లాక్ డౌన్ వేళ తెలంగాణ లో ఆ నూనెను అంతలా తాగేశారట
X
లాక్ డౌన్ వేళ ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వీధి చివర ఉంటే టిఫెన్ సెంటర్లు మొదలు మెస్ లు.. పెద్ద పెద్ద హోటళ్లు మూతపడ్డాయి. పెళ్లిళ్లు.. ఫంక్షన్లు నిలిచిపోయాయి. ఎవరింట్లో వారు ఉండటమే. ఇంట్లో నుంచి బయటకు రావటమే తగ్గిపోయింది. ఇలాంటివేళ.. తెలంగాణ రాష్ట్రంలో వినియోగించిన ఆయిల్స్ మీద ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

లాక్ డౌన్ వేళ.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వినియోగించినట్లుగా తేలింది. విడిరోజుల్లో ఎక్కువగా వినియోగించే పామాయిల్ స్థానాన్ని రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను భారీగా వినియోగించారు. తర్వాతి స్థానాల్లో వేరుశన నూనె.. రైస్ బ్రాన్ ఆయిల్ ను వినియోగించినట్లుగా తేలింది. గత ఏడాది ఏప్రిల్ అమ్మకాలతో పోల్చినప్పుడు.. ఈ ఏప్రిల్ లోతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఆయిల్స్ అమ్మకాలకు సంబంధించి ఆసక్తికర డేటా బయటకువచ్చింది.

ప్రతి నెలా సగటున ఆయిల్ ఫెడ్ 800 టన్నుల పామాయిల్ ను అమ్మేది. అలాంటిది ఈ ఏప్రిల్ లో మాత్రం కేవలం 400 టన్నుల పామాయిల్ మాత్రమే విక్రయించింది. దీని స్థానంలో సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఏకంగా 900 టన్నుల నుంచి 1700 టన్నుల మేర వినియోగించటం గమనార్హం. రెగ్యులర్ అమ్మకాలకు దాదాపు రెట్టింపు అమ్మకాలు సాగటం విశేషం.

లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఏప్రిల్ నెలాఖరు నాటికి సాధారణ అమ్మకాలకు మించి ఏకంగా వెయ్యి టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను అమ్మటం ఆయిల్ ఫెడ్ సంస్థ చరిత్రలో రికార్డుగా చెబుతున్నారు. లాక్ డౌన్ వేళ.. పెద్ద హోటళ్లు.. భారీగా సాగే పెళ్లిళ్లు.. ఇతర ఫంక్షన్లు లేని నేపథ్యంలో నూనెల వినియోగం బాగా తగ్గుతుందని భావించారు. అందుకు భిన్నంగా ఇంటి పట్టున ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున ఆయిల్ ను వినియోగించటం చూస్తే.. ఒక్కొక్కరి సరాసరి బరువు కూడా భారీగా పెరిగిపోయి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. పిండి వంటకాలకు, చిరుతిళ్ల కోసం మగువలకు బాగాపనిపెట్టారన్నమాట.