Begin typing your search above and press return to search.

విశాఖ చేరిన కరోనా.. ఒకేరోజు ఐదు అనుమానిత కేసులు నమోదు...

By:  Tupaki Desk   |   5 March 2020 7:30 AM GMT
విశాఖ చేరిన కరోనా.. ఒకేరోజు ఐదు అనుమానిత కేసులు నమోదు...
X
విశాఖలో కరోనా వైరస్‌ కలకలం రేపుతోంది. విశాఖలో ఒకే రోజు ఐదు అనుమానిత కేసులు నమోదు కావడంతో కరోనా భయం తో విశాఖ వణికి పోతోంది. బుధవారం ఒక్కరోజే ఐదుగురు వైరస్ లక్షణాలతో విశాఖ ఛాతి ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన వారు ముగ్గురు ఉండటం గమనార్హం. విశాఖపట్నానికి చెందినవారు ఇటీవలే మలేషియా, సింగపూర్ వెళ్లి వచ్చారు. దీనితో ఆ కుటుంబంలోని ముగ్గురికి కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన కరోనా వార్డుకు తరలించి , చికిత్స అందిస్తున్నారు.

వీరితో పాటుగా సౌదీ నుంచి వచ్చిన మరో ఇద్దరిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరందరికీ వైద్యులు చికిత్స అందించడంతో పాటు కరోనా నిర్ధారణ కోసం ముక్కు, గొంతు నుంచి నమూనాలను తీసుకుని హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రి కి , తిరుపతి లోని ల్యాబ్‌, పుణెకు పంపించారు. ప్రస్తుతం ఐదుగురు జ్వరం, తీవ్ర జలుబు, గొంతు నొప్పి తో భాద పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే , దీనిపై వైద్య బృందం మాట్లాడుతూ ..వారికీ కరోనా సోకింది అని ఇంకా నిర్దారణ కాలేదు అని , కేవలం అనుమానం మాత్రమే అని , రిపోర్టులు వచ్చే వరకు ఎటువంటి ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్తున్నారు.

వారికీ సంబంధించిన రిపోర్టులు వచ్చిన తర్వాతే కరోనాపై నిర్దారణకు వస్తామంటున్నారు అధికారులు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు కరోనా వైరస్‌ పై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఒక్క కరోనా వైరస్ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపించామంటున్నారు. రిపోర్ట్ రాగానే క్లారిటీ వస్తుందని.. ప్రజలు భయపడాల్సిన పనిలేదని.. ముందు జాగ్రత్తగా ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన నగరాలలోని అనేక ఆసుపత్రుల్లో కరోనా వార్డులు ఏర్పాటు చేశామని, వైద్యం అందించేందుకు సిబ్బందిని అలర్ట్‌ చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.