Begin typing your search above and press return to search.

కరోనా పుట్టినింట్లో చివరి పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు

By:  Tupaki Desk   |   27 April 2020 10:20 AM IST
కరోనా పుట్టినింట్లో చివరి పేషెంట్ ను డిశ్చార్జ్ చేశారు
X
ప్రమాదకర కరోనా వైరస్ పుట్టిన వూహాన్ నగరం.. ఒకప్పుడు ఆ మహమ్మారి కారణంగా ఎంతలా ఉక్కిరిబిక్కిరి అయ్యిందో తెలిసిందే. మహానగరం మొత్తం మూసేసి మరీ కరోనా వైరస్ పై చేసిన లాక్ డౌన్ యుద్ధం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ఈ నగరానికి చెందిన ప్రజల్ని ఎవరిని వారి ఇళ్లల్లో నుంచి బయటకు రాకుండా చేస్తూ.. కరోనా వైరస్ బాధితుల సంఖ్య తగ్గించేందుకు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. 76 రోజుల పాటు లాక్ డౌన్ లో ఉన్న వూహాన్ నగరంలో ఏప్రిల్ 8 నుంచి ఆంక్షల్ని సడలించారు.

వూహాన్ రాజధానిగా ఉన్న హుబాయ్ ప్రావిన్సులో మొత్తం 68,128 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క వూహాన్ లోనే 50,333 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా పాజిటివ్ అయిన చివరి పేషెంట్ ను సైతం డిశ్చార్జి చేశారు. దీంతో.. వూహాన్ నగరంలో కరోనా కేసులు ఇప్పుడు జీరోకు చేరుకున్నాయి. ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి కిందా మీదా పడుతున్న వేళ.. వైరస్ కు జన్మస్థలి అయినా వూహాన్ మహా నగరం మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి.

కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా వూహాన్ లో పాజిటివ్ కేసులు అడపాదడపా వెలుగు చూశాయి. తాజాగా మాత్రం.. చివరి పేషెంట్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయటంతో.. కరోనా పుట్టింట్లో ఇప్పుడా వైరస్ ప్రభావం నిల్ అయిపోయిన పరిస్థితి. వూహాన్ మాదిరి ప్రపంచం మొత్తం అలాంటి పరిస్థితి ఎప్పటికి చోటు చేసుకుంటుందో? ఇదిలా ఉంటే.. కరోనా భయం నుంచి పూర్తిగా బయట పడిన చైనాలో ఇప్పుడు సందడి వాతావరణం నెలకొంది. ఆ దేశ వాణిజ్య రాజధాని షాంఘైలో ఆదివారం వేళ.. అన్ని మార్కెట్లు సందడిగా మారాయి. బార్లు కిక్కిరిసి పోయాయి. వీటికి సంబంధించిన ఫోటోలు చూసినంతనే యావత్ ప్రపంచం ఆసూయపడేలా ఉన్నాయని చెప్పకతప్పదు.