Begin typing your search above and press return to search.

భారత్ లో 35వేల కేసులు..1147మరణాలు

By:  Tupaki Desk   |   1 May 2020 4:36 AM GMT
భారత్ లో 35వేల కేసులు..1147మరణాలు
X
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మరోసారి పంజా విసురుతోంది. కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ లో కొత్తగా మరో 60 మందికి వైరస్ పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా కర్నూలు జిల్లాల్లో 25 కేసులు నిర్ధారణ కాగా.. గుంటూరులో 19 - అనంతపురం - కర్నూలులో 6 - పశ్చిమ గోదావరి - విశాఖపట్నంలో 2 చొప్పున నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,463కి చేరింది. గడచిన 24 గంటల్లో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ తో చనిపోయిన వారి సంఖ్య 33కి చేరింది.

*తెలంగాణలో మళ్లీ పంజా

తెలంగాణలో కరోనా మళ్లీ పంజా విసిరింది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 22 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1038కి చేరింది. 28మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఈరోజు పెరిగిన అన్ని కేసులు కూడా హైదరాబాద్ పరిధిలోనివే కావడం ఆందోళన కలిగిస్తోంది. కొద్దిరోజులుగా రాజధానిలోనే బాధితులు పెరుగుతున్నారు. తాజాగా మార్కెట్లో పనిచేస్తున్న వ్యక్తి ద్వారా పలువురు వ్యాపారులకు సోకినట్లుగా గుర్తించారు.

*భారత్ లో పెరుగుతున్న కరోనా తీవ్రత

భారత దేశంలో కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కొత్తగా 1993 కేసులు నిర్ధారణ అయ్యాయి. 73మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 1147కి చేరింది. మొత్తం బాధితుల సంఖ్య 35043కు చేరువైంది. 8889మంది కోలుకోగా.. ప్రస్తుతం 25007మంది చికిత్స పొందుతున్నారు.

దేశంలో మహారాష్ట్రలోనే కరోనా వైరస్ బాగా విజృంభిస్తోంది. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 10498కి చేరగా.. 459మంది మృత్యువాతపడ్డారు. ముంబైలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంది. ఆ తరువాత గుజరాత్, మధ్యప్రదేశ్ , ఢిల్లీలో కరోనా వైరస్ విస్తృతి బాగా ఉంది.

*ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 33 లక్షలు దాటింది. ఇందులో 2.34 లక్షల మంది మృతిచెందగా.. ఇప్పటి వరకూ 10.42 లక్షల మంది కోలుకున్నారు. మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న కరోనా మహమ్మారి పై పోరులో కీలక మైలురాయి ఇది.

అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రెండు రోజులపాటు అక్కడ మహమ్మారి కాస్త శాంతించినట్లు కనిపించినా.. మళ్లీ విజృంభించింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,502 మంది ప్రాణాలను బలి తీసుకుంది. దీంతో అమెరికాలో మొత్తం మరణాల సంఖ్య 63,861కి చేరింది. అలాగే, బాధితుల సంఖ్య 11లక్షలకు చేరువలో ఉంది.