Begin typing your search above and press return to search.

ఒక్కడి తప్పు... వనస్థలిపురంపై కరోనా దాడి

By:  Tupaki Desk   |   3 May 2020 3:58 PM GMT
ఒక్కడి తప్పు... వనస్థలిపురంపై కరోనా దాడి
X
మలక్ పేట సంఘటన మరవకముందే వనస్థలిపురంలో కరోనా సీరియస్ నెస్ బయటపడింది. నిన్ననే ఒకే కుటుంబంలోని 11 మందికి కరోనా సోకడంతో జడుసుకున్న జనంలో వనస్థలి పురంలో 169 కుటుంబాలను హోం క్వారంటైన్ కు కట్టడి చేయడంతో కొత్త అలజడి రేగుతోంది. వనస్థలిపురంలో చాపకింద నీరులా పాకిన కరోనాను అదుపుచేయడానికి అక్కడ ప్రభుత్వం ఏకంగా 8 కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటుచేసింది ఈ జోన్లు నాలుగు కాలనీల్లో విస్తరించి ఉన్నాయని తెలిపారు.

వారం రోజుల పాటు ఈ జోన్లలో మెయిన్ రోడ్ల సహా రాకపోకలు బంద్ చేశారు. హుడా సాయినగర్‌, సుష్మా సాయినగర్‌ - కమలానగర్‌ - రైతుబజార్‌-సాహెబ్‌ నగర్‌ రోడ్డు - ఏ - బీ టైప్‌ కాలనీలు - ఎస్‌ కేడీ నగర్‌ - ఫేజ్‌-1 కాలనీ - సచివాలయనగర్‌ తదితర ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించారు.ఇంతకీ ఇక్కడెలా వ్యాపించిందో తెలుసా... మలక్ పేట వ్యాపారే దీనికి కారణం. ఎవరింట్లో వారుండండి. ఎవరినీ ఎవరూ కలవొద్దు అని ఎంత మొత్తుకుని చెబుతున్నా... వినకుండా మలక్‌ పేట్‌ గంజ్‌ కు చెందిన ఓ వ్యాపారి కొద్ది రోజుల క్రితం వనస్థలిపురంలోని తన సోదరుడి వచ్చాడు. అతని ద్వారా ఆ కుటుంబానికి పాకింది. దీంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ కుటుంబంలోనే ఆరుగురికి సోకింది.

తాజాగా ఈరోజు హుడా సాయినగర్ లో ఓ మహిళకు సోకింది. ప్రజలు సహకరించాలని... లేకపోతే ఇది ఇలాగే అందరికీ విస్తరిస్తుందని అధికారులు విజ్జప్తి చేశారు. ఒక్క వ్యక్తి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూశారా? దయచేసి మీరు అలా చేయకండి. మీరు ఇంట్లోనే ఉంటే త్వరగా తగ్గుతుంది. త్వరగా తగ్గితే లాక్ డౌన్ కూడా ఎత్తేస్తారు. అంతా హాయిగా బతకొచ్చు అని అధికారులు మరీమరీకోరుతున్నారు.