Begin typing your search above and press return to search.

న్యూటన్ నాల్గవ నియమంతో కరోనా..!

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:30 PM GMT
న్యూటన్  నాల్గవ నియమంతో కరోనా..!
X
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. అన్ని దేశాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త కేసులు కూడా లక్షల్లో నమోదవుతున్నాయి. గతేడాది మార్చిలో వైరస్ విలయతాండవం చేయగా... పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ఇక దాదాపు రెండేళ్ల నుంచి విద్యార్థుల చదువులు కూడా అంతంతమాత్రంగా సాగుతున్నాయి. మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ విద్యార్థి ప్రకటన వైరల్ గా మారింది. ఏకంగా న్యూటన్ కు, కరోనా వ్యాప్తికి లింక్ చేసి ఆ విద్యార్థి ఓ థియరీని రచించాడు. కాగా అది కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

భౌతిక శాస్త్రం తెలిసిన ప్రతీ ఒక్కరికీ న్యూటన్ నియమాలు తెలిసే ఉంటాయి. సైన్సుకు సంబంధించిన ఆ నియమాలతోనే ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కరోనా వ్యాప్తి అనేది పరిశోధనలకు విలోమానుపాతంలో ఉంటాయని విద్యార్థి సర్ ఐజాక్ పేర్కొన్నాడు. కేసులు పెరుగుతున్నా కొద్దీ పరిశోధనలు తగ్గుతాయని అన్నాడు. అంతేకాకుండా ఒకవేళ పరిశోధనలు పెరిగితే మాత్రం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పాడు. దీనికి ఓ సమీకరణం సృష్టించాడు. అందులో కే విలువ స్థిరమైన వేరియబుల్ గా అనగా వినాశనంగా అభివర్ణించాడు. కాగా ఆ వివరణను కొవిడ్ కాల్ కా న్యూటన్ అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు.

జులై తర్వాత కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా విద్యాసంస్థలను తెరిచారు. ఆయా దేశాలు, రాష్ట్రాల పరిస్థితులను బట్టి తరగతులు నిర్వహించారు. ఇక విద్యార్థులు సైతం ఆన్ లైన్ తరగతుల పట్ల విసుగు చెంది... ప్రత్యక్ష తరగతులపై ఆసక్తి చూపారు. అంతా సవ్యంగా సాగుతోందని అనుకునేలోపే మాయదారి వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గతనెల చివరి వారం నుంచి ప్రతాపం చూపిస్తోంది. ఒక్కొక్కటిగా నమోదైన కేసులు క్రమంగా పెరుగుతూ పోయాయి. ఆఖరికు దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం వేలల్లో నమోదవుతున్నాయి. చిన్నారులు కూడా ఎక్కువసంఖ్యలో వైరస్ బారిన పడుతున్నారు.

పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. వైరస్ ను కట్టడి చేయడం కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. భారత్ లో మూడో వేవ్ మొదలైందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొన్నాళ్లు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలలకు మళ్లీ సెలవులు ప్రకటిస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ గందరగోళంలోనే కరోనా వ్యాప్తిని ఏకంగా న్యూటన్ నాలుగో నియమంతో అనుసంధానం చేసి... సమీకరణ రూపొందించాడు ఆ విద్యార్థి. అంతేకాకుండా వ్యాప్తి తీరును వివరించాడు.