Begin typing your search above and press return to search.

100 రోజుల్లో కరోనా ప్రపంచాన్ని ఎలా వణికించింది !

By:  Tupaki Desk   |   11 April 2020 2:30 AM GMT
100 రోజుల్లో కరోనా ప్రపంచాన్ని ఎలా వణికించింది !
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఈ కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తుంది. చివరికి యుద్ధంలో గెలుస్తాం అని నమ్మకం ఉన్నప్పటికీ , ఆ రోజు ఎప్పుడు వస్తుంది - అప్పటికి ఈ మహమ్మారి కారణంగా ఎంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా దెబ్బకి వణికిపోతున్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో .ప్రపంచమే పూర్తిగా స్తంభించి పోయింది . ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య రవాణా ఆగిపోయింది. గత డిసెంబర్‌ 31న చైనా తొలిసారిగా వైరస్‌ గురించి ప్రకటించింది. జనవరి 1న వూహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌ ను షట్‌ డౌన్‌ చేశారు.

నూతన సంవత్సరానికి ఒక్క రోజు ముందు ..ప్రపంచం మొత్తం ఆనందంలో మునిగిపోయిన వేల డిసెంబర్‌ 31 - 2019 న చైనా ప్రభుత్వ వెబ్‌ సైట్‌ లో కరోనా తోలి అప్ డేట్ వచ్చింది. ఆ వార్తను అప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చైనా దక్షిణ ప్రాంతంలో సముద్రజీవుల మాంసం విక్రయించే మార్కెట్‌ లో ఓ మధ్య వయస్కురాలితో పాటు మరో 30 మందిలో కనిపించిన ఆ న్యుమోనియా లక్షణాలపై ఆరోగ్య శాఖ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదిక పంపారు. తరువాత దీన్ని గుర్తించినట్టు డబ్ల్యూహెచ్‌ వో తెలిపింది. చైనా బయట ఈ కరోనా లక్షణాలేవీ అప్పటికి కనిపించలేదు. కానీ ఆ తర్వాత ఒక్కో రోజు గడుస్తుంటే ప్రళయం సరిహద్దులు దాటి.. మన దేశానికి.. మన నగరానికి - మన వీధిలోకి వస్తే ఎలా ఉంటుందో ప్రజలందరికీ వంద రోజుల్లోనే అర్థమైపోయింది.

వూహాన్‌ లో వ్యాధికి కారణమేమిటన్న విషయం స్పష్టమైన కొన్ని రోజులకే ప్రాణాంతక కరోనా వైరస్‌ చైనా సరిహద్దులు దాటుకుని థాయ్‌ లాండ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది. వూహాన్‌ లో ఉండే 61 ఏళ్ల వ్యక్తి ఒకరిలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు బ్యాంకాక్‌ విమానాశ్రయ అధికారులు థర్మల్‌ స్కానర్ల సాయంతో గుర్తించారు. ఒకట్రెండు వారాల్లోనే చాలా ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలున్న వారు భారీ సంఖ్యలో చేరుతున్నట్లు వూహాన్‌ లో వెద్యులు గుర్తించారు. ఆ తరువాత వైరస్‌ ఉనికి కనిపించిన 20 రోజులకు గువాంగ్‌ డాంగ్‌ ప్రాంతంలో రెండు కొత్త కేసులు బయటపడ్డాయి. వీరికి వూహాన్‌ తో ఏ సంబంధమూ లేదని ప్రకటించారు. దీనితో వైరస్‌ ఒకరి నుంచి ఇంకొకరికి సోకుతున్నట్లు అర్థమైంది.

ఆ తరువాత యూరోపియన్‌ దేశాలలో కరోనా వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది. స్పెయిన్ - ఇటలీల్లో తొలి కేసులు నమోదయ్యాయి. చైనాలో 258 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 11 వేల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీనితో చైనా వెళ్లి వచ్చిన వారిపై అమెరికాలో నిషేధం మొదలైంది. ఇక జనవరి చివరి కల్లా ..ఈ వైరస్ భారత్ తో పాటుగా - ఫిలిప్పీన్స్ - రష్యా - స్వీడన్ - బ్రిటన్‌ లకూ విస్తరించింది. వూహాన్‌ నివాసి ఒకరు ఫిలిప్పీన్స్‌ లో మరణించడంతో చైనా బయట తొలి కరోనా మరణం నమోదైంది.

ఇక ఈ కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన 70 రోజుల తరువాత కరోనాను ఒక మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 1.16 లక్షలకు చేరుకుంది. ఆ తరువాత అమెరికాలో కరోనా విజృంభణ మొదలైంది. భారత్‌ విషయానికి వస్తే.. మార్చి 12న సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యక్తి మరణంతో భారత్‌ లో తొలి కరోనా మరణం నమోదైంది. భారత్‌ లో మార్చి 22న ఒక రోజు జనతా కర్ఫ్యూ - ఒక రోజు విరామం తర్వాత మార్చి 24 నుంచి 3 వారాల పాటు దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ ను ప్రకటించారు. ఇప్పటికి కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి 100 రోజులు దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 16 లక్షలకు చేరగా - మరణాలు 95 వేలు దాటాయి.