Begin typing your search above and press return to search.

ట్రంప్ చెప్పిన లూక్ ఆడమ్స్ ఎవరు? ఆమె ప్రత్యేకత ఏంది?

By:  Tupaki Desk   |   8 May 2020 10:15 AM IST
ట్రంప్ చెప్పిన లూక్ ఆడమ్స్ ఎవరు? ఆమె ప్రత్యేకత ఏంది?
X
కరోనా వేళ.. వెలుగులోకి రాని హీరోలు ఎందరో. సేవా భావంతో ప్రజల్ని ఆదుకునేందుకు తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే వారెందరో. అలాంటి వారి త్యాగం.. కష్టం చాలా సందర్భాల్లో బయటకు రాదు. ప్రచారానికి దూరంగా ఉంటూ.. తమ పని తాముచేసుకుంటూ పోతారు. ఆ కోవలోకే వస్తారు లూక్ ఆడమ్స్.

ఇంతకీ ఆమె ఎవరు? అంటే.. ఒక సామాన్య నర్సు మాత్రమే. కానీ.. ఆమె గొప్పతనం గురించి తెలిస్తే మాత్రం హేట్సాఫ్ అని చెప్పకుండా ఉండలేరు. ఎందుకంటే.. ఆమెలాంటి పెద్ద మనసు చాలా అరుదుగానే ఉంటుంది మరి. కరోనా వేళ.. అమెరికాలో భారీ ఎత్తున కరోనా వ్యాపించటం.. వేలాదిమంది అమెరికన్లు ఇప్పటివరకూ మరణించటమే కాదు.. రానున్న రోజుల్లోనూ ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

తక్కువలో తక్కువ వేసుకున్నా లక్ష మంది అమెరికన్ల ప్రాణాల్ని కరోనా వైరస్ తీయటం ఖాయమంటున్నారు. ఇలాంటివేళ.. ప్రాణాల్ని కాపాడేందుకు అమెరికా వ్యాప్తంగా ఉన్న ఎందరో నర్సులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. నర్సులే అసలైన హీరోలుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఆయనో ఉదాహరణను ప్రస్తావించారు. దేశంలో లూక్ ఆడమ్స్ లాంటి ఎందరో నర్సులు సేవాభావంతో శ్రమిస్తున్నట్లుగా చెబుతూ.. అభినందించారు.

ఇంతకీ ఈ లూక్ ఆడమ్స్ ఎవరంటే.. సాదాసీదా నర్సు. పదకొండేళ్లుగా నర్సుగా పని చేస్తున్నా.. ఆమె పేరు ఎప్పుడూ బయటకు రాలేదు. తాజాగా దేశాధ్యక్షుల వారే స్వయంగా ప్రస్తావించటానికి కారణం లేకపోలేదు. న్యూయార్కులో కరోనా విరుచుకు పడుతున్న వేళ.. ఆ సంగతి తెలుసుకొని కారులో ఆసుపత్రికి చేరుకొని కారులోనే ఉంటూ.. తొమ్మిది రోజుల పాటు కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించిన వైనం బయటకు వచ్చింది. ఇలాంటి వారెందరో అమెరికాలో ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా శ్రమిస్తున్న వారికి ఆ మాత్రం గౌరవం దక్కాల్సిందే.