Begin typing your search above and press return to search.

ఉలిక్కిప‌డిన తెలంగాణ‌: గ‌్రీన్‌ జోన్‌ లో తొలిసారే 4 కేసులు

By:  Tupaki Desk   |   10 May 2020 10:30 AM GMT
ఉలిక్కిప‌డిన తెలంగాణ‌: గ‌్రీన్‌ జోన్‌ లో తొలిసారే 4 కేసులు
X
తెలంగాణలోని 33 జిల్లాల్లో నాలుగైదు జిల్లాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు కాలేదు. దీంతో ఆ జిల్లాలు మొద‌టి నుంచి గ్రీన్ జోన్ ప‌రిధిలో ఉన్నాయి. అయితే తాజాగా ఓ గ్రీన్ జోన్ జిల్లాలో తొలిసారి క‌రోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఏకంగా 4 కేసులు న‌మోద‌వ‌డంతో ఒక్క‌సారిగా ఆ జిల్లాతో పాటు ప్ర‌భుత్వం ఉలిక్కిప‌డింది. ఆ కేసులు న‌మోదైనది ఎక్క‌డో కాదు.. హైద‌రాబాద్‌ను ఆనుకుని ఉన్న‌ యదాద్రి భువనగిరి జిల్లా.

ఈ జిల్లాలో ఇన్నాళ్ల‌పాటు క‌రోనా కేసులు న‌మోదు కాలేదు. తొలిసారిగా శ‌నివారం కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాకు చెందిన నలుగురికి కరోనా పాజిటివ్ తేలినట్లు కలెక్టర్ అనితా రామచంద్రన్ ప్రకటించారు. జిల్లాలోని ఆత్మకూరు మండలంలో మూడు, సంస్థాన్ నారాయణపురంలో ఒక పాజిటివ్ కేసు నమోదైందని వెల్ల‌డించారు. అయితే వారంతా మ‌హారాష్ట్ర‌లోని ముంబై నుంచి వ‌చ్చిన‌వారే. అక్క‌డ ఉపాధి కోసం వెళ్లి ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో స్వస్థలాలకు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ తేలింది. అయితే పాజిటివ్ వచ్చిన వారి ప్రాథ‌మిక కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు ప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. వ‌ల‌స కార్మికులు త‌ర‌లివ‌స్తుండ‌డంతో జిల్లావ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి త‌నిఖీలు ముమ్మ‌రం చేస్తున్నారు.

క‌రోనా క‌ల్లోలం: ఎల్బీన‌గ‌ర్ చుట్టూ క‌రోనా కేసులే..

తెలంగాణ‌లో క‌రోనా కేసుల‌ను తీక్ష‌ణంగా గ‌మ‌నిస్తే ఓ విష‌యం అర్థ‌మ‌వుతూ ఉంటుంది. ఎక్క‌డైతే క‌రోనా పాజిటివ్ కేసు తొలిసారి వెలుగు చూసిందో ఆ ప్రాంతాల్లోనే భారీగా కేసులు న‌మోదవుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. క‌రోనా కేసుల‌ను సునిశితంగా ప‌రిశీలిస్తే అర్థ‌మ‌వుతుంది. ఇన్నాళ్లు ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలోని సూర్యాపేట‌లో అదే తీరున కేసులు న‌మోద‌య్యాయి. సూర్యాపేట‌లోని మార్కెట్ ద్వారా ఏకంగా 30-40 కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ఉమ్మ‌డి రంగారెడ్డి వికారాబాద్‌ లోనూ అదే ప‌రిస్థితి. అయితే ఇక్క‌డ మ‌ర్కజ్‌ కు వెళ్లి వ‌చ్చిన‌వారి వ‌ల‌న‌. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లోని మ‌ల‌క‌ పేట గంజ్ ద్వారా. ఆ గంజ్ ద్వారా కూడా దాదాపు 10- 20 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా హైద‌రాబాద్‌లోని ఎల్బీన‌గ‌ర్ క‌రోనా అడ్డా‌గా మారింది.

క‌రోనా వైరస్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ లో తీవ్రంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా వ‌న‌స్థ‌లిపురం - స‌రూర్‌ న‌గ‌ర్ తదిత‌ర ప్రాంతాల్లో కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. అయితే ఇక్క‌డ కేసులు పెర‌గ‌డానికి కార‌ణం సూర్యా‌పేట‌. సూర్యాపేట టు ఎల్బీన‌గ‌ర్ లింక్ ఏర్ప‌డింది. సూర్యాపేటలో పల్లీలు కొనుగోలు చేసుకొని సరూర్‌ నగర్‌ లో విక్ర‌యించిన వ్య‌‌క్తికి మొద‌ట క‌రోనా సోకింది. అత‌డు విక్ర‌యాలు చేయ‌డంతో కొన్న‌వారు.. అక్క‌డ ప‌నిచేసిన వారు ఇలా మొత్తం లెక్కెస్తే 57 కేసులు న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. ఇంకా దీని కార‌ణంగా రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కేసులు న‌మోద‌వుతున్న ప్రాంతాల‌న్నీ ఎల్బీనగర్ ప‌రిధిలోనే ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎల్బీనగర్ ప్రాంతం‌లో అధికారులు ఏకంగా 15 కంటైన్మెంట్ జోన్స్‌ ఏర్పాటుచేశారు. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. హైద‌రాబాద్ శివారు ప్రాంతంగా ఉన్న ఎల్బీన‌గ‌ర్‌ లో ఎక్కువ‌గా ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాకు చెందిన వారు నివ‌సిస్తుంటారు. సూర్యాపేటవాసులు కూడా పెద్ద‌సంఖ్య‌లో ఉన్నారు. ఆ సూర్యాపేట లింక్ ఎల్బీన‌గ‌ర్‌ కు పాకి ఇప్పుడు క‌ల్లోలం సృష్టిస్తోంది.