Begin typing your search above and press return to search.

ల‌క్ష దాటిన మృతులు: యూర‌ప్‌ లో మ‌ర‌ణ‌మృదంగం

By:  Tupaki Desk   |   19 April 2020 11:29 AM GMT
ల‌క్ష దాటిన మృతులు: యూర‌ప్‌ లో మ‌ర‌ణ‌మృదంగం
X
క‌రోనా వైర‌స్ భూగోళాన్ని చుట్టేసింది. మాన‌వ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఆ వైర‌స్ బారిన ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు బ‌లవుతున్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా యూరప్ దేశాల్లో కరోనా విల‌య తాండ‌వం చేస్తోంది. ఆ వైర‌స్‌ ను అంచ‌నా వేయ‌డంలో నిర్ల‌క్ష్యం.. వైర‌స్ వ్యాపించిన త‌ర్వాత క‌ట్ట‌డి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఆ దేశాలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ వైర‌స్ బారిన ప‌డి మృతి చెందిన వారు దాదాపు ల‌క్ష‌కు పైగా. ఇటలీ - స్పెయిన్ దేశాలు ఈ వైర‌స్ బారి నుంచి కోలుకోవ‌డం లేదు.

ఈ వైర‌స్ బారిన ప‌డి ఇటలీలో 23,227 - స్పెయిన్ లో 20,043మంది మృత్యువాత ప‌డ్డారు. ఫ్రాన్స్‌ లో 19,323 మంది మృతి చెందగా - బ్రిటన్‌ లో 15 వేలకు పైగా మంది చనిపోయారు. మొత్తం ప్రపంచంలో 22,89,500 మందికి పాజిటివ్ లక్షణాలు న‌మోద‌య్యాయి. వీరిలో 1,57,539 మంది చ‌నిపోయారు. ఈ లెక్క‌ల్లో సుమారు మూడింట రెండు వంతుల మంది యూరప్ దేశాలకు చెందిన‌ వారే మృత్యువాత ప‌డ్డార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో సుమారు 38 వేల మంది మరణించగా - చైనాలో 4,632 మంది - జర్మనీలో 3,400 మంది ఈ వైర‌స్ బారిన ప‌డి మృతిచెందారు.

ఈ విధంగా గ‌ణాంకాలు ఉండ‌గా ఆయా దేశాలు మాత్రం ఆ లెక్క‌లు త‌ప్పు అని మృతులు, కేసుల సంఖ్య‌ను త‌క్కువ చేసి చూపిస్తున్నాయ‌ని అమెరికా - చైనా ప‌ర‌స్ప‌రం ఆరోప‌న‌లు చేసుకుంటున్నాయి. ఈ వైర‌స్ ఇంకా క‌ట్ట‌డిలోకి రాక‌పోవ‌డంతో భార‌త‌దేశంలో పాటు అన్ని దేశాల్లో ప్ర‌స్తుతం లాక్‌ డౌన్ ప‌క‌డ్బందీగా కొన‌సాగుతోంది. అనేక దేశాలు క‌రోనా కేసులపై సీరియస్‌ గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే స్పెయిన్ లాక్‌ డౌన్‌ ను మే 9వ తేదీ వరకు పొడిగించింది. జపాన్ - బ్రిటన్ - మెక్సికో తమ దేశాల్లో ఆంక్షలు తీవ్రం చేస్తున్నాయి. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో స్విట్జర్లాండ్ - డెన్మార్క్ - ఫిన్లాండ్ త‌దిత‌ర దేశాల్లో కొంత స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో దుకాణాలు - వ్యాపారాలు త్వ‌ర‌లోనే పునఃప్రారంభం కానున్నాయి. ఈ విధంగా క‌రోనా వైర‌స్ ప్ర‌పంచంపై విశ్వ‌రూపం చూపిస్తోంది.