Begin typing your search above and press return to search.

ఆకతాయిల ఆగడాలకు చెక్ పెడుతున్న పోలీస్ డ్రోన్స్..?

By:  Tupaki Desk   |   8 April 2020 9:10 AM GMT
ఆకతాయిల ఆగడాలకు చెక్ పెడుతున్న పోలీస్ డ్రోన్స్..?
X
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విధించారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని బయటకు రావొద్దని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఎవరైనా బయటికి వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ, చాలా మంది ప్రభుత్వం చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు. అవసరం లేకపోయినా రోడ్ల మీదకు వస్తున్నారు.

అయితే, దీనిని కట్టడి చేసేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న తరహాలో ప్రయత్నాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా కాలనీలు - గల్లీలలో ఒక్కచోట చేరే వాళ్ల పని పట్టేందుకు డ్రోన్ కెమెరాలను ప్రయోగిస్తున్నారు. ఈ కెమెరా ద్వారా లైవ్ మానిటరింగ్ చేసి ఎక్కడైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలా రోడ్ల మీద గుమిగూడి ఉంటున్న వారి పైన పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తున్నారు.

హైదరాబాద్ బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రయోగించిన డ్రోన్ కెమెరా సంబంధించిన విజువల్స్‌ లో కొంత మంది గుమిగూడి ముచ్చటించుకుంటున్న యువకులు డ్రోన్ కెమెరా చూడగానే పరుగులు పెడుతున్నారు. దీనికి సంబంధించిన డ్రోన్ కెమెరా విజువల్స్‌ ను పోలీసు అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు. ఎక్కడైనా సరే పబ్లిక్ ఉన్నట్లు సమాచారం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలతో బయటకి వచ్చే వారిని పట్టుకుని కేసు నమోదు చేస్తామని - ఇప్పటికి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 12 డ్రోన్ కెమెరాల ద్వారా జన సంచారాన్ని సమీక్షిస్తామని కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు.