Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్...ఏపీలో ఏవి కొనాలన్నా గళ్లు - క్యూల్లోనే

By:  Tupaki Desk   |   26 March 2020 2:30 AM GMT
కరోనా ఎఫెక్ట్...ఏపీలో ఏవి కొనాలన్నా గళ్లు - క్యూల్లోనే
X
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో ఇప్పుడు సరికొత్త పద్దతులు అమల్లోకి వచ్చాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పటికే ఏపీలో లాక్ డౌన్ అమల్లోకి రాగా... మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చి... లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న దరిమిలా... ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. నిషేధాజ్ఝల వేళ... ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే రైతు బజార్లు - కిరాణా షాపులు తెరుస్తున్న వేళ... ఈ మూడు గంటల్లోనే నిత్యావసరాల కోసం జనం ఎగబడుతున్నారు. నిత్యావసరాలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని ప్రభుత్వాలు చెబుతున్న వేళ... రేపటి పరిస్థితి ఏమిటో? అన్న భావన... జనం అవసరానికి మించి కొనుగోళ్లు చేయడం ప్రారంభించారు. ఫలితంగా అటు రైతు బజార్లు, ఇటు కిరాణా షాపుల వద్ద అంతకంతకూ రద్దీ పెరుగుతోంది. మరి రద్దీ... కరోనాను స్వాగతించడమేనన్న భావనతో అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఈ నిబంధనల మేరకు.. రైతు బజార్లు - కిరాణా షాపుల ముందు గళ్లు - క్యూ కోసం గీసిన గీతలు కనిపిస్తున్నాయి.

ఇకపై అటు రైతు బజార్లు అయినా, ఇటు కిరాణా షాపులు అయినా... ఎక్కడ కొనుగోళ్లు చేయాలన్నా... వాటి ముందు గీసిన క్యూలలో నిలుచోవాల్సిందే. అంతేకాకుడా అదే క్యూలలో గీసిన గళ్లలో నిలబడాల్సిందే. ఈ గళ్లలో మన ముందు నిలుచున్న వ్యక్తి కొనుగోలు ముగిసిన తర్వాత, ఆ వ్యక్తి ఆ గడి నుంచి బయటకు వెళ్లిన తర్వాతే మనం ముందుకు కదలాల్సి ఉంటుంది. ఈ తరహా విధానం ఏపీలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో బుధవారం అమల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విధానం తొలుత కృష్ణా జిల్లా గన్నవరం రైతు బజార్ లో కనిపించగా... ఆ మరునాడే... జిల్లాలోని మిగిలిన ప్రాంతాలు - విజయవాడలోని రైతు బజార్లు - కొన్ని కిరణా షాపుల ముందు కనిపించాయి. తాజాగా బుధవారం ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ గళ్లు దర్శనమిచ్చామన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ గళ్లను గీయటంలో మునిసిపాలిటీ - పంచాయతీ అధికారులు బాగానే కష్టపడుతున్నారు. కరోనా వేళ... ఎవరూ బయటకు రావద్దని ఓ వైపు నిబంధనలు అమలులోకి వస్తే... ఇటు మునిసిపల్ - అటు పంచాయతీ సిబ్బందితో పాటు వైద్య సిబ్బంది కూడా ఎళ్ల వేళలా పనిచేయాల్సి వస్తోంది. గళ్లు - క్యూ లైన్లను ఎప్పటికప్పుడు కొత్తగా గీయటం - వాటిలోనే జనం వెళ్లేలా అవగాహన కల్పించడం సిబ్బందికి కత్తి మీద సాములానే మారిపోయిందని చెప్పాలి. ఇక ఈ గళ్లు, క్యూ లైన్లలో జనం వెళ్లేలా చూడటం పోలీసులకు కూడా తప్పనిసరి బాధ్యతగా మారిపోయిందట. గళ్లు దాటుతున్న ఓ వ్యక్తిని మంగళవారం ఓ పోలీసు చితకబాదిన వైనం వైరల్ గా మారిపోయింది. మరి కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయేదాకా జనానికి ఈ గళ్లు - క్యూలు తప్పవన్న మాట.