Begin typing your search above and press return to search.

ఐటీ రంగంలో కరోనా కల్లోలం..టెకీలకు కష్టమే!

By:  Tupaki Desk   |   7 April 2020 1:30 AM GMT
ఐటీ రంగంలో కరోనా కల్లోలం..టెకీలకు కష్టమే!
X
అభివృద్ధిలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతోన్న అమెరికా వంటి అగ్రదేశాలు మొదలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న దేశాల వరకు కరోనా దెబ్బకు విలవిలలాడిపోతున్నాయి. కరోనా మహమ్మారి విసిరిన పంజాకు పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. 2008లో చవిచూసిన ఆర్థిక మాంద్యంతో పోలిస్తే....కరోనా దెబ్బకు రాబోతోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం ఎన్ని ఏళ్లు ఉంటుందో కూడా చెప్పలేమని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇప్పటికే జీడీపీలో వృద్ధిలేక నానా తిప్పలు పడుతోన్న మనదేశ ఆర్థిక వ్యవస్థను కరోనా కోలుకోలేని దెబ్బకొట్టిందని అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాబోయే కాలంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని చెబుతున్నారు. ఐటీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపనుందని - రాబోయే 6 నెలల కాలంలో లక్షన్నర ఐటీ ఉద్యోగాలు పోతాయని అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలోనే పలు కంపెనీలు ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

లాక్ డౌన్ విధించడం వల్ల వచ్చిన సమస్యల కంటే లాక్ డౌన్ తదనంతర పరిణామాలు భయంకరంగా ఉండబోతున్నాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడి చేసిన తర్వాత - లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తర్వాత అనేక రంగాలతోపాటు ఉద్యోగ - ఉపాధి రంగాలలో పెను మార్పులు సంభవిస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ప్రభావం ఐటీ రంగంపై కూడా పడబోతోందని - రాబోయే 3 నుంచి 6 నెలల కాలంలో లక్షన్నర మంది ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారని అంచనా వేస్తున్నారు. ఐటీ దిగ్గజ కంపెనీలు ఓ మోస్తరుగా తట్టుకోగలిగినా... చిన్న చిన్న ఐటీ కంపెనీలు కరోనా దెబ్బకు మనుగడ సాధించలేవని అంటున్నారు. అటువంటి కంపెనీల్లో పనిచేస్తున్నవారి ఉద్యోగాలకు గ్యారెంటీ లేదని అంటున్నారు. మన దేశంలోని ఐటీ రంగంలో దాదాపు 50 లక్షల మంది పనిచేస్తున్నారని - అందులో10 లక్షల మంది ఈ చిన్న కంపెనీల్లోనే పనిచేస్తున్నారని చెబుతున్నారు. మనదేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీలలో దాదాపు 10 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా.

కరోనా బారిన పడిన వారిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువ. పైగా ఐటీ రంగంతో ముడిపడిన ట్రావెల్‌ - టూరిజం - మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు దెబ్బతిన్నాయి. దీంతో, ట్రావెల్‌ ఇండస్ట్రీపై ఆధారపడిన బీపీవోలు లే ఆఫ్‌ పేరుతో దాదాపు 300 మంది ఉద్యోగులను తొలగించి ...పరోక్షంగా హింట్ ఇచ్చాయి. మరోవైపు కొన్ని కంపెనీలు... 2 నెలల ముందస్తు నోటీసులు ఇచ్చి ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని చూస్తున్నాయి. లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్ తో 85 శాతం వరకూ వ్యాపారం పడిపోవడంతో కొన్ని కంపెనీలు జీతాల్లో కోతలు విధిస్తున్నాయి. ఇక, కొత్త ప్రాజెక్టులను కొన్నాళ్ల పాటు అటకెక్కించాల్సిందేనని పలు కంపెనీలు భావిస్తున్నాయట. కొందరు ఉద్యోగులకు ఆల్రెడీ కంపెనీలు పొమ్మనలేక పొగబెడుతూ ఒత్తిడి పెంచుతున్నాయట. కరోనా దెబ్బకు మరి కొద్ది నెలలు ఐటీ రంగంలో కొత్తగా రిక్రూట్ మెంట్ కూడా ఉండకపోవచ్చు. ఒకవైపు ఉద్యోగాలు పోయి...కొత్త ఉద్యోగాలు దొరక్క దాదాపు లక్షన్నర నుంచి 2 లక్షల మంది వరకు ఐటీ ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా...ఐటీ రంగానికి రానున్నది గడ్డుకాలమని చెప్పవచ్చు.