Begin typing your search above and press return to search.

చిగురుటాకులా వణుకుతున్న న్యూయార్క్

By:  Tupaki Desk   |   23 March 2020 11:30 PM GMT
చిగురుటాకులా వణుకుతున్న న్యూయార్క్
X
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూయార్క్ మహా నగరం ఇప్పుడు కరోనాతో విలవిలలాడుతోంది. రోజు గడిచే కొద్దీ.. ఈ నగరానికి చెందిన పలు కరోనా పాజిటివ్ కేసులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నాయి. అంకెలు వేగంగా మారిపోవటమే కాదు.. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఊహించేందుకు సైతం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆదివారం పొద్దుపోయే సమయానికి నగరంలో 1800 మంది కరోనా కారణంగా ఆసుపత్రి పాలైతే.. వారిలో 450 మందిని ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. నగరానికి చెందిన 10,764 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది.

కరోనా భయాందోళనలకు గురైన న్యూయార్క్ వాసులు ఇప్పుడు ఇళ్లల్లో నుంచి బయటకు రావటానికి సైతం భయపడుతున్నారు. నిత్యవసరాల కొరత ఎక్కువగా ఉంది. ముందస్తు జాగ్రత్తతో ముందే కొనేసి ఇళ్లల్లో సరుకుల్ని నిల్వ చేసుకోవటంతో.. షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా పాజిటివ్ నమోదైన వారికి చికిత్స చేసేందుకు ఆసుపత్రుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. వైరస్ ను కంట్రోల్ చేయటానికి ఆసుపత్రి సిబ్బంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైరస్ భయంతో గర్భవతుల వెంట వారి భాగస్వాముల్ని అనుమతించేందుకు నిరాకరిస్తున్నారు.

ఇప్పుడున్న పరిస్థితి రానున్న రోజుల్లో మరింత పెరిగే ప్రమాదం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. తాము అస్సలు బాగోలేమని న్యూయార్క్ వాసులు చెబుతున్నారు. మార్చితో పోలిస్తే.. ఏప్రిల్ లో పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని.. మేలో పరిస్థితిని ఊహించేందుకే ఇష్టపడటం లేదు. కరోనా చైన్ బ్రేక్ చేయలేని పక్షంలో న్యూయార్క్ నగరంలో 40 నుంచి 80 శాతం ప్రజలకు కరోనా విస్తరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.