Begin typing your search above and press return to search.

ఒక వ‌దంతి విలువ రూ.1,750 కోట్ల..ఆ మేర‌కు న‌ష్టం!

By:  Tupaki Desk   |   3 March 2020 2:30 PM GMT
ఒక వ‌దంతి విలువ రూ.1,750 కోట్ల..ఆ మేర‌కు న‌ష్టం!
X
ప్ర‌పంచంలో కొత్త వైర‌స్ లు మ‌నుషుల్లోకి వ‌చ్చిన‌ప్పుడు పుట్టుకొచ్చే వ‌దంతులు కొన్ని ఉంటాయి. ఇది వ‌ర‌కూ ఆంత్రాక్స్ వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన‌ప్పుడు - ఆ త‌ర్వాత చికెన్ గ‌న్యా జ్వ‌రాలు వ‌చ్చిన‌ప్పుడు.. అంతిమ ప్ర‌భావం చికెన్ మీదే ప‌డింది! ఆంత్రాక్స్ మాంసం నుంచి మ‌నుషుల్లోకి ప్ర‌బ‌లుతుంద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఇక చికెన్ గున్యా దెబ్బ‌కు చికెన్ అమ్మ‌కాలు పడిపోయాయి. కిలో చికెన్ 25 రూపాయ‌ల‌కు ఇచ్చారు అప్ప‌ట్లో! వాస్త‌వానికి చికెన్ గ‌న్యా జ్వ‌రం దోమ‌ల నుంచి వ్యాపిస్తుంద‌ని అప్ప‌ట్లోనే గ‌ట్టిగా ప్ర‌చారం చేసినా వ‌దంతుల‌నే ప్ర‌జ‌లు ఎక్కువ‌గా న‌మ్మిన‌ట్టుగా ఉన్నారు.

ఇక ఎక్క‌డో చైనా నుంచి ప్రపంచానికి వ్యాపించిన క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కూడా చికెన్ మీదే ప‌డింది. ఈ వైర‌స్ చికెన్ తిన‌డం వ‌ల్ల వ్యాపిస్తుంద‌నే ఒక వ‌దంతి విప‌రీతంగా ప్ర‌చారానికి నోచుకుంది. దీంతో దాని మార్కెట్ పై గ‌ట్టి ప్ర‌భావం ప‌డింది. కరోనాకు - చికెన్ కు సంబంధం లేద‌ని పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు గ‌ట్టిగా ప్ర‌చారం చేస్తున్నాయి. అయితే వదంతుల‌కు ఉన్న విలువ వాస్త‌వాల‌కు ఉండేమో!

ఫ‌లితంగా పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ ఒక సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. కోవిడ్ 19 వైర‌స్ విష‌యంలో వదంతుల వ‌ల్ల దేశీయ‌ పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ ఇప్ప‌టి వ‌ర‌కూ సుమారు 1,750 కోట్ల రూపాయ‌ల న‌ష్టాల‌ను చవి చూస్తోంద‌ని ఆ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వదంతుల వ్యాప్తి వ‌ల్ల‌నే జ‌నాలు చికెన్ అంటే భ‌య‌ప‌డుతూ ఉన్నార‌ని - తిన‌డం త‌గ్గించేస్తూ ఉన్నార‌ని - దీంతో ఉత్ప‌త్తిలో మిగులు వ‌ల్ల ధ‌ర‌లు త‌గ్గించాల్సి వ‌స్తోంద‌ని పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు వాపోతున్నాయి.

పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌పై ఇలాంటి ప్ర‌భావం ప‌డితే వ్య‌వ‌సాయం మీద కూడా ప‌డుతుంద‌ని - జొన్న‌లు - మొక్క‌జొన్న‌ల ధ‌ర‌లూ త‌గ్గిపోయి రైతులు ఇబ్బంది ప‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నాయి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు. మొత్తానికి వదంతుల‌కు ఎంత శ‌క్తి ఉందో ఈ ఉదంతం చాటి చెబుతున్న‌ట్టుగా ఉంది.