Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలు సేఫ్‌: భారత్‌ లో కరోనా హాట్‌ స్పాట్‌ లు ఇవే..

By:  Tupaki Desk   |   5 April 2020 7:54 AM GMT
తెలుగు రాష్ట్రాలు సేఫ్‌: భారత్‌ లో కరోనా హాట్‌ స్పాట్‌ లు ఇవే..
X
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ ఈ కేసులు వందల సంఖ్యలో ఉంటున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,072 కేసులు నమోదైన విషయం తెలిసిందే. వీరిలో 75 మంది మృత్యువాత పడగా కేవలం 213 మంది మాత్రమే కోలుకున్నారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి స్లోగా ఉన్న సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌ కు వెళ్లిన వారి వలన ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో దేశంలో కల్లోలం రేగింది. అయితే ఆ ప్రార్థనలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారంతా ఇప్పుడు తమ తమ ప్రాంతాలకు వెళ్లడంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వ పలు నగరాలను కరోనా హాట్‌ స్పాట్‌ లుగా గుర్తించింది.

కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కడ అధికంగా నమోదవుతున్నాయో గుర్తించింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్‌ నివారణకు.. కట్టడికి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 14 కరోనా హాట్‌ స్పాట్స్‌ ను గుర్తించింది. కేంద్రం వివరాల ప్రకారం.. దిల్షాద్ గార్డెన్ (ఢిల్లీ) - నిజాముద్దీన్ (ఢిల్లీ) - నోయిడా (ఉత్తరప్రదేశ్) - భిల్వారా (రాజస్థాన్) - కాసర్‌ గడ్ (కేరళ) - పతనంతిట్ట (కేరళ) - కన్నూరు (కేరళ) - ముంబై (మహారాష్ట్ర) - పుణె (మహారాష్ట్ర) - యావత్మల్ (మహారాష్ట్ర) - ఇండోర్ (మధ్యప్రదేశ్) - జబల్‌ పూర్ (మధ్యప్రదేశ్) - అహ్మదాబాద్ (గుజరాత్) - లద్దాఖ్ (లద్దాఖ్)లు దేశవ్యాప్తంగా ఉన్న కరోనా హాట్ స్పాట్స్‌ గా కేంద్రం గుర్తించింది.

అయితే హాట్‌ స్పాట్స్‌ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క ప్రాంతం కూడా లేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత పరిస్థితి మెరుగ్గా ఉందనే భావించాలి. ఎందుకంటే కేంద్రం గుర్తించిన హాట్‌ స్పాట్స్‌ లలో కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వాటినే గుర్తించింది. అందుకే తెలుగు ప్రాంతాల్లో కొంత పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పవచ్చు. దీంతో కొంత తెలుగు రాష్ట్రాలు కరోనా విషయంలో సేఫ్‌ గానే ఉన్నాయని భావించాలి.