Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం:తెలంగాణలో ఒకే రోజు ముగ్గురికి.. 30కి చేరిన కేసులు

By:  Tupaki Desk   |   23 March 2020 9:00 AM GMT
కరోనా కల్లోలం:తెలంగాణలో ఒకే రోజు ముగ్గురికి.. 30కి చేరిన కేసులు
X
తెలంగాణలో కరోనాను కట్టడి చేయాలని సీఎం కేసీఆర్ ఎంత పట్టుదలగా ప్రయత్నాలు చేస్తూ కరోనా వైరస్ మాత్రం విశృంఖలంగా విస్తరిస్తూనే ఉంది. కరోనా వైరస్ తెలంగాణలో రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. తెలంగాణలో 2వ స్టేజ్ వచ్చినట్టే కనిపిస్తోంది.

తాజాగా తెలంగాణ లో ఒకే రోజు మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30కి చేరింది. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తెలంగాణలో తాజాగా కరీంనగర్ లో ఒక పాజిటివ్ కేసు.. మరో రెండు హైదరాబాద్ లో నమోదైనట్టు తెలిపారు. దీంతో మొత్తం కేసులు 30కి చేరాయని బులిటెన్ లో తెలిపారు.

ఈ నేపథ్యంలోనే ఈనెల 31వరకు తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుందని.. ఎవరూ బయటకు రావద్దని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాధి విస్తృతి పెరిగితే లాక్ డౌన్ - నిర్బంధం పొడిగిస్తామని కూడా వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తున్నట్టు తెలిసింది.

తాజాగా సోమవారం ఫ్రాన్స్ - ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఇద్దరు యువకులకు పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన 21 ఏళ్ల యువకుడు ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. అలాగే 30 ఏళ్ల వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. వీరికి వైరస్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇక మరో కేసు కరీంనగర్ లో నమోదైంది. 23 ఏళ్ల కరీంనగర్ యువకుడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. కరీంనగర్ లో పర్యటించిన ఇండోనేషియా బృందంతో ఇతడు కలిశాడు. వారితో కలిసి తిరిగాడు. తాజాగా చేసిన పరీక్షల్లో ఇతడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఒకేసారి మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణలో కలకలం రేగింది. మరిన్ని ముందు జాగ్రత్త చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది.