Begin typing your search above and press return to search.

ఇంత పెద్ద స్వీట్ న్యూస్ సారు చెప్పకుండా ఈటెల చెప్పుడా?

By:  Tupaki Desk   |   10 April 2020 3:30 AM GMT
ఇంత పెద్ద స్వీట్ న్యూస్ సారు చెప్పకుండా ఈటెల చెప్పుడా?
X
కరోనా.. కరోనా.. కరోనా. ఈ మాయదారి కరోనాతో వ్యవస్థలు.. ప్రజలు.. ఆ మాటకు వస్తే దేశాలకు దేశాలు ఆగమాగమైపోయిన పరిస్థితి. ఇలాంటివేళలో.. కరోనా మహమ్మారి పట్టేసిన ఒక రాష్ట్రం.. దాని నుంచి ఫ్రీ కావటం అంత తేలికైన విషయం కాదు. పురాణాల్లో చదువుకున్నట్లుగా ఒక మహిషాశురమర్దిని.. మరోనరకాసుర వధ లాంటిదే. మరి.. అలాంటి గొప్పరోజు దగ్గర్లోనే ఉందన్న విషయాన్ని చెప్పాల్సి వస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వదులుతారా? తానే మైకు పట్టుకొని.. చుట్టూ మందిని పెట్టుకొని.. ఎదురుగా మీడియా ప్రతినిధుల్ని కూర్చొబెట్టుకొని.. బిడ్డల్లారా.. జాగ్రత్తగా వినండి.. అద్భుతమైన ఫలితం వచ్చేయనుందంటూ చెప్పకుండా ఉంటారా?

ఇప్పటి వరకూ ఎప్పుడూ లేని రీతిలో ఒక ఎపిసోడ్ లో అదే పనిగా కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టించిన ఘనత కరోనాకు దక్కిందనే చెప్పాలి. మహమ్మారి కరోనా నుంచి తెలంగాణ ఫ్రీ కానుందని.. ఆ శుభ తరుణం ఎప్పుడో కాదు.. ఇవాల్టి (శుక్రవారం) నుంచే షురూ కానున్నట్లుగా చెప్పుకొచ్చారు తెలంగాణరాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. అంతేకాదు.. ఈ నెల 24 నాటికి కరోనా కేసుల నుంచి తెలంగాణ బయటపడనుందన్న శుభవార్త ఆయన నోటి నుంచి వచ్చింది.

ఇంత సింఫుల్ గా ఎలా చెబుతావు రాజేందరా? అన్న దీర్ఘాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ఈటెల వారు కరోనాను ఎలా కంట్రోల్ కానుందన్న విషయాన్ని లాజిక్ రూపంలో చెప్పుకొచ్చారు. శుక్రవారం నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని.. నాలుగైదు రోజుల తర్వాత కేసులు అస్సలు ఉండొవన్నారు. ఎందుకంటే.. మర్కజ్ లింకు నమూనాల సేకరణ పూర్తైందని.. గురువారం నాటికి మర్కజ్ లింకు ఉన్న 665 మంది నమూనాల ఫలితాలు వచ్చేసినట్లుగా చెప్పారు.

శుక్రవారం 18 పాజిటివ్ కేసులు వచ్చాయని.. దీంతో తెలంగాణ లో 471 కేసులకు చేరినట్లైందని చెప్పారు. తెలంగాణ లో నమోదైన మొత్తం కేసుల్లో 388 కేసులు కేవలం మర్కజ్ లింకువేనన్న విషయాన్ని స్పష్టం చేశారు. మర్కజ్ వెళ్లిన వారు.. వారితో కాంటాక్ట్ అయిన వారే ఉన్నారన్నారు. అంతేకాదు.. శుక్రవారం అరవై నుంచి డెబ్భై వరకూ డిశ్చార్జిలు ఉంటాయన్నారు. మరింత కీలకమైన విషయాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పకుండా ఈటెల వారు చెప్పుడేందన్న డౌట్ రాక మానదు.

ఎందుకంటే.. కేసీఆర్ లాంటి పెద్ద మనిషి నోటి నుంచి ఇరవై నాలుగు తర్వాత తెలంగాణ ఫ్రీ అని.. తర్వాత ఏదైనా తేడా వస్తే.. జరిగే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఒకసారి అలాంటి లెక్క సారు చెప్పటం.. ఆ వెంటనే మర్కజ్ ఎపిసోడ్ తెర మీదకు రావటం తెలిసిందే. అందుకేనేమో.. గుడ్ న్యూస్ చెప్పే బాధ్యతను మంత్రి ఈటెల వారికి అప్పజెప్పి ఉండొచ్చు. లాక్ డౌన్ కారణంగా విసిగిపోయిన ప్రజలకు సాంత్వన కలిగించేందుకు వీలుగా ఒక మాట ఈటెల వారి నోటి నుంచి చెప్పించటం ద్వారా.. మంచి రోజులు వచ్చేసినట్లేనన్న భావన కలిగించటం కూడా ఒక వ్యూహంగా చెబుతున్నారు. ఏమైనా సాంబా.. ఈటెల వారి మాటల్ని రాసేసుకున్నావుగా?