Begin typing your search above and press return to search.

అధికారుల తీరుతో సారు మాట అభాసుపాలైందే?

By:  Tupaki Desk   |   20 April 2020 3:45 AM GMT
అధికారుల తీరుతో సారు మాట అభాసుపాలైందే?
X
రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఒక మాట వస్తుందంటే.. దానికి ఉండే ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటిది సీఎం నోటి నుంచి వచ్చిన మాట ఆయన్ను అభాసుపాలు అయ్యేలా చేసే దుస్థితి తెలంగాణలో తాజాగా చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమనండి.. ఇంకేదైనా కారణం కావొచ్చు.. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన మాట గంట వ్యవధిలోనే కామెడీగా మారిపోయింది. ఇంతకూ జరిగిందేమంటే.. దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ కొనసాగింపు నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయటం తెలిసిందే.

దీని ప్రకారం ఈ రోజు (ఏప్రిల్ 20) నుంచి లాక్ డౌన్ కు సంబంధించి కొన్ని మినహాయింపులు అందుబాటులోకి వచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యం లో మంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపి.. కేంద్రం చెప్పిన మినహాయింపుల్ని అమలు చేసే అవకాశం లేదని తేల్చేశారు. కేంద్రం మే మూడు వరకూ లాక్ డౌన్ విధిస్తే.. దాన్ని మే ఏడు వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయాల్ని మీడియాతో చెప్పేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ తో ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవైఎనిమిదిగా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇంత తక్కువగా పాజిటివ్ కేసులు నమోదైంది లేదు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పూర్తి అయ్యిందో లేదో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి కరోనా అప్డేట్ నోట్ విడుదలైంది. అందులో ఆదివారం రాష్ట్రంలో పాజిటివ్ కేసుల్ని ఏకంగా 49 పేర్కొనటంతో అవాక్కు అయ్యే పరిస్థితి.

స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన గణాంకాలకు భిన్నంగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నోట్ లో భిన్నమైన ఫిగర్స్ రావటం వెనుక తప్పు ఎవరిది? అన్నది ప్రశ్నగా మారింది. కేసీఆర్ ప్రెస్ మీట్ కు.. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ కు మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉండటం గమనార్హం. ఎంతో కీలకమైన కరోనా పాజిటివ్ కేసుల విషయంలో అధికారుల వైఖరి మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. సారుకు ఇచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయరా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.