Begin typing your search above and press return to search.

మాయదారి కరోనా.. మన దేశానికి వచ్చేసిందా?

By:  Tupaki Desk   |   28 Jan 2020 10:04 AM GMT
మాయదారి కరోనా.. మన దేశానికి వచ్చేసిందా?
X
ఏ దేశాని కైనా ఏదో ఒక ఇబ్బంది.. సమస్య అనేది ఉంటుంది. అందుకు సంబంధించిన సమాచారం బయటకు వస్తుంటుంది. కానీ.. పొరుగున ఉన్న డ్రాగన్ దేశం అందుకు భిన్నం. ఆ దేశం లో ఏం జరుగుతుందో ఒక పట్టాన బయటకు రాదు. ఏం జరిగినా గుట్టుగా జరిగిపోతూ ఉంటుంది. మిగిలిన దేశాలకు భిన్నంగా ఆ దేశంలోని వ్యవహారాలన్ని భిన్నంగా సాగుతుంటాయి.

ఏ దేశంతోనైనా పేచీ కి సిద్ధంగా ఉండే డ్రాగన్ దేశానికి ఇప్పుడో కొత్త తలపోటు కరోనా వైరస్ పేరుతో వచ్చింది. ఇప్పటివరకూ ఏ దేశానికైనా తాను దడ పుట్టించే అలవాటున్న డ్రాగన్ దేశం.. ఇప్పుడా వైరస్ కారణంగా దడదడలాడిపోతోంది. ఇప్పటికే ఆ దేశం లోని పన్నెండు నగరాలకు వ్యాపించటమే కాదు.. ఆయా నగరాల నుంచి రవాణా ను పూర్తిగా బంద్ చేసి.. ఆ నగరాలకు సీల్ వేశారు కూడా. అయితే.. చైనా నుంచి వివిద దేశాలకు చెందిన వారు.. ఈ వైరస్ ఉదంతం గురించి విన్నంతనే తమ దేశాలకు వెళ్లి పోయారు.

దీంతో..కొన్ని దేశాలకు కరోనా వైరస్ వ్యాపించింది. ఈ కారణంతోనే అమెరికాతో సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాపించింది. తాజాగా అలా వ్యాపించిన జాబితాలో శ్రీలంక కూడా చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ లక్షణాలతో ఉన్న ముగ్గురు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరారు. వారిని ఐసోలేషన్ వార్డుల్లో అబ్జర్వేషన్ లో పెట్టినట్లుగా ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ వెల్లడించారు.

అనుమానితుల రక్త నమూనాల్ని సేకరించి పరీక్షలకు పంపారు. తాజాగా ఆసుపత్రి లో చేరిన ముగ్గురి లో ఇద్దరు ఢిల్లీ వాసులు కాగా.. మరొకరు ఎన్ సీఆర్ ప్రాంతానికి చెందిన వారు. ఇప్పటికే కరోనా వైరస్ సందేహం లో హైదరాబాద్ లో నలుగురు.. పాట్నాలో కొందరు ఆసుపత్రులకు వెళ్లటం.. వారి రిపోర్టు నెగిటివ్ రావటం తెలిసిందే. కరోనా వైరస్ బయటకు వచ్చిన తర్వాత చైనా నుంచి భారత్ కు 33,552 మంది ప్రయాణికులు భారత్ కు వచ్చారు. వీరందరికి ఎయిర్ పోర్టు లోనే స్క్రీనింగ్ నిర్వహించి బయటకు పంపుతున్నారు. ఇప్పటి వరకూ కరోనా వైరస్ అనుమానితులే కానీ.. పాజిటివ్ గా వచ్చిన కేసు ఒక్కటి లేదు. చైనా నుంచి పెద్ద ఎత్తున వస్తున్న వారి కారణంగా.. ఈ వైరస్ భారత్ కు వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ప్రస్తుతం దేశంలో ఎండలు ముదురుతున్న వేళ.. ఈ వైరస్ బతికి బట్టకట్టే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.