Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌ లో ఇద్దరికి కరోనా

By:  Tupaki Desk   |   14 March 2020 8:15 AM GMT
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌ లో ఇద్దరికి కరోనా
X
దేశంలో కరోనా వ్యాప్తి చెందుతుండగా హైదరాబాద్‌ లో అలాంటి వాతావరణం లేదు అనుకుంటుండగానే మరోసారి కరోనా కలకలం రేగింది. ఇప్పటికే ఒకరికి చికిత్స అందించి విజయవంతంగా నయం చేసి పంపించగా తాజాగా మరో ఇద్దరు కరోనా అనుమానితులు ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో రెండు అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. వారు విమానం దిగి బయటకు వస్తుండగా థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వారిని ఎయిర్‌ పోర్ట్‌ సిబ్బంది పరీక్షలు చేయగా కరోనా అనుమానితులుగా గుర్తించారు.

వారు ఇటలీ - దుబాయ్‌ నుంచి వచ్చిన 28 - 40 ఏళ్ల మహిళలు ఉన్నారు. వారికి కరోనా లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తూ వెంటనే వారిని 108 అంబులెన్స్‌లో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల కోసం ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టపైన ఉన్న హరిత హోటల్ - టీబీ ఆస్పత్రికి కరోనా అనుమానితులను తరలించి వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం ప్రత్యేక విమానంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కరోనా అనుమానితులను నేరుగా అనంతగిరికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన వార్డుల్లో వారికి చికిత్స చేస్తున్నారు.ఈ సందర్భంగా అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాపై కీలక ప్రకటన చేశారు. వెయ్యి కోట్లు కాదు.. ఐదు వేల కోట్లయినా కరోనా నివారణకు ఖర్చు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా నివారణకు మంత్రివర్గంలో చర్చిస్తామని తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని రాజ్ భవన్‌ కే పరిమితమయ్యారు. ఈ మేరకు రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటన విడుదల చేసింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ తన కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.