Begin typing your search above and press return to search.

కరోనా: ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మృతులు, 30 లక్షలకు కేసులు

By:  Tupaki Desk   |   26 April 2020 6:20 AM GMT
కరోనా: ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మృతులు, 30 లక్షలకు కేసులు
X
కరోనా కేసుల్లో తెలంగాణను ఏపీ దాటేయడం కలకలం రేపింది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారానికి 1061కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 31 మంది చనిపోయారు. 171మంది ఇప్పటివరకు కోలుకున్నారు.

*తెలంగాణకు పెద్ద ఊరట

తెలంగాణ రాష్ట్రానికి కరోనా నుంచి పెద్ద ఊరట లభించింది. కొత్తగా కేవలం 7 కేసులు మాత్రమే నమోదు కావడం విశేషం. హైదరాబాద్ లో 6, వరంగల్ అర్బన్ లో 1 మాత్రమే నమోదయ్యాయి. 20 రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం ప్రభుత్వానికి ప్రజలకు ఉపశమనంగా మారింది. ఆదివారం నాటికి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 991కి చేరగా.. ఇప్పటివరకు తెలంగాణలో కరోనాతో 26మంది మరణించారు. ఇక కరోనా నుంచి 280మంది కోలుకున్నారు.

*భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఇక భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 1990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఏకంగా 49మంది మరణించారు. ఇప్పటివరకు దేశంలో మొత్తం 26496 కరోనా కేసులు నమోదు కాగా.. దేశవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 824మంది మరణించారని కేంద్రం తెలిపింది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ల నుంచే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

ఇక దేశంలోనే మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా తీవ్రత ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7628 కేసులు నమోదు కాగా.. 323మంది మరణించారు. ఒక్కరోజే నిన్న కొత్తగా మహారాష్ట్రలో 800 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ముంబైలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తం కేసుల్లో 13.8శాతం మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.

*ప్రపంచవ్యాప్తంగా 30లక్షలకు కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తూనే ఉంది. ఈ వైరస్‌కు బలైనవారి వారి సంఖ్య 2 లక్షలు దాటింది. బాధితుల సంఖ్య కూడా 30 లక్షలు చేరువైంది. బాధితులు, మరణాల్లో అత్యధికంగా అమెరికా, ఐరోపా దేశాల్లో చోటుచేసుకుంటున్నాయి. ఇక, కేసుల్లో మూడో వంతు, మరణాల్లో నాలుగో వంతు ఒక్క అమెరికాలోనే నమోదయినట్టు జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ విశ్లేషించింది. స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, టర్కీల్లో మొత్తం కేసుల కంటే అగ్రరాజ్యంలోనే ఎక్కువ మంది వైరస్ బారినపడటం గమనార్హం.

అమెరికాను కరోనా అతలాకుతలం చేస్తోంది. శనివారం కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 2494మంది మరణించడం తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనాతో అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 53928కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 956375కు చేరింది. 24గంటల్లోనే ఏకంగా 36వేల కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అగ్రరాజ్యం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.