Begin typing your search above and press return to search.

శ్రీకాకుళంలో కరోనా..దిమ్మదిరిగే కాంటాక్టులు

By:  Tupaki Desk   |   26 April 2020 4:51 AM GMT
శ్రీకాకుళంలో కరోనా..దిమ్మదిరిగే కాంటాక్టులు
X
శ్రీకాకుళం.. ఈ ఏపీ చివరన ఉన్న కోస్తా జిల్లాలో మొన్నటివరకు కరోనా ఉనికే లేదు. పక్కనున్న విజయనగరంలోనూ అంతే..కానీ ఎక్కడి నుంచి వచ్చిందో మహమ్మారి పచ్చగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు అంటించేసింది. జిల్లాలోని పాతపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మరి అంత కట్టుదిట్టంగా ఉన్న శ్రీకాకుళంలో ఇలా కరోనా ప్రవేశించడానికి గల కారణమేంటన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తోంది.

అసలు విషయం ఆరాతీస్తే ఢిల్లీ లింకులు బయటపడ్డాయి. పాతపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడం వెనుక ఆ ఇంటి పెద్ద ఢిల్లీ నుంచి రావడమే కారణం. ఢిల్లీలోని మెట్రో స్టేషన్ లో ఓ కాంట్రాక్టర్ వద్ద శ్రీకాకుళంకు చెందిన వ్యక్తి పనిచేస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. కరోనా-లాక్ డౌన్ తో అతడు ఢిల్లీ నుంచి శ్రీకాకుళంకు చేరుకున్నాడు. వచ్చిన వెంటనే అధికారులు అతడిని గృహ నిర్బంధంలో ఉంచారు.ఈనెల 20తో అతడి 14రోజుల క్వారంటైన్ ముగిసింది. లక్షణాలు బయటపడడంతో తాజాగా కరోనా పాజిటివ్ సోకింది. ఇక ఇతడి వల్ల ఇతడి ఇంట్లోని ఇద్దరు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు భావిస్తున్నారు. ఇతడు ఇప్పటివరకు 67మందితో కలిసినట్టు అధికారులు గుర్తించి 29మందిని క్వారంటైన్ కు తరలించారు. మిగతా వాళ్లను వెతుకున్నారు.

కరోనా వచ్చిన వ్యక్తి ఓ ఫంక్షన్ కు వెళ్లాడని.. దానికి 300 మంది హాజరయ్యారని తేల్చారు. క్వారంటైన్ పూర్తయ్యాక అత్తారింటికి వెళ్లాడు. దీంతో ఇంకా ఎన్ని కేసులు బయటపడతాయోనన్న భయం అధికారుల్లో వెంటాడు.

ఇక ఢిల్లీ మర్కజ్ లో పాల్గొన్న వ్యక్తులతో కలిసి ఇతడు రైలులో వచ్చి ఉంటాడని.. అందుకే కరోనా సోకినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. కరోనా వెలుగుచూడడంతో వీరి కుటుంబం ఉన్న గ్రామంతోపాటు చుట్టుపక్కల సంచరించిన 27 గ్రామాలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఒక్క బాధితుడు విచ్చలవిడిగా తిరగడంతో ఎంత మందికి కరోనా అంటించాడనే భయం అందరిలోనూ నెలకొంది.