Begin typing your search above and press return to search.

విజయవాడలో కరోనా విజృంభణ..రెడ్ జోన్ గా ప్రకటన..!

By:  Tupaki Desk   |   20 April 2020 9:10 AM GMT
విజయవాడలో కరోనా విజృంభణ..రెడ్ జోన్ గా ప్రకటన..!
X
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ నగరమైతే దాదాపుగా రెడ్ జోన్ పరిధిలోకి వచ్చింది. విజయవాడలో కరోనా విజృంభణ ఈ లెవెల్ లో ఉంటుంది అని ఊహించని అధికార యంత్రాంగానికి ఇప్పుడు మరో కొత్త సమస్య ఎదురవుతోంది. అదే నిజమైతే నగరంలో నిరవధిక లాక్ డౌన్ కొనసాగించ తప్పని పరిస్ధితులు వస్తాయని భావిస్తున్నారు. దీనితో ప్రజలు ఇప్పటినుండైనా కూడా సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

కృష్ణాజిల్లా వ్యాప్తంగా 75 కేసులు నమోదైతే ఒక్క విజయవాడ నగరంలోనే 60 కేసులు ఉన్నాయంటే ఇక్కడ పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. నగరంలో 90 శాతం రెడ్ జోన్ పరిధిలోనే ఉందని రెండు రోజుల క్రితం అధికారులు చేసిన ప్రకటనతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. తొలుత ఓ పానీపూరీ వాలా - ఆ తర్వాత మరో టిఫిన్ బండి - ఢిల్లీ మర్కజ్ రిటర్న్స్ ద్వారా కేసుల సంఖ్య పెరుగుతుందని భావించిన విజయవాడ అధికారులు తాజాగా నమోదవుతున్న కేసుల సంఖ్య నిద్రపోనివ్వడం లేదు. తాజాగా వస్తున్న కొన్ని కేసుల్లో వారి ప్రయాణ చరిత్ర కూడా చెప్పలేని పరిస్ధితి ఉండటంతో వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందా అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి,

లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నా వాటిని నిర్లక్ష్యం చేస్తూ షాపింగ్ - ఇతర అవసరాల పేరుతో రోడ్ల పైకి వస్తున్న జనమే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని నగర పోలీసులు గుర్తించారు. రెడ్ జోన్ అని చెప్పినా కూడా వినకుండా బయటకి వస్తున్నారని - ఆగ్రహంగా ఉన్న పోలీసులు ఆదివారం నుంచి డ్రోన్ల ద్వారా నిఘా పెట్టారు. ఇప్పటికే విజయవాడ నగరమంతా దాదాపుగా రెడ్ జోన్ పరిధిలోనే ఉంది. కేవలం రామవరప్పాడు ప్రభుత్వాసుపత్రి నుంచి ఏలూరు వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలు మాత్రమే సురక్షితంగా ఉన్నాయి. కానీ , ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే విజయవాడ నగరాన్ని వందశాతం రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశమున్నట్టు ప్రసారమాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆదివారం మాంసాహార మార్కెట్లను మూసేసిన అధికారులు - తాజాగా ఇవాళ్టి నుంచి రైతు బజార్లను కూడా మూసేశారు. దీంతో ప్రజలు రోడ్లపైనే షాపింగ్ చేసుకోవాల్సిన పరిస్ధితి.