Begin typing your search above and press return to search.

రాజధాని నిర్మాణంలో కార్పొరేట్‌కూ బాధ్యత!

By:  Tupaki Desk   |   29 Jun 2015 11:11 AM GMT
రాజధాని నిర్మాణంలో కార్పొరేట్‌కూ బాధ్యత!
X
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో కార్పొరేట్‌ సంస్థలకు కీలక బాధ్యతలు అప్పగించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, తదితరాల్లో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ)ని అమలు చేయాలని, ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలను భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.

రాజధాని ప్రాంతంలో ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, నిశ్చింతతో కూడిన భవితకు భరోసా ఇచ్చేందుకు కార్పొరేట్‌ కంపెనీల సహకారాన్ని ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం రాజధాని పరిధిలో లక్ష మంది జీవిస్తున్నారు. రాజధాని నిర్మాణం ప్రారంభమై.. పూర్తయ్యే సరికి ఇక్కడ జనాభా గణనీయంగా పెరగనుంది. వారికి మౌలిక సదుపాయాలతోటు గ్రామీణులకు విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల్లో కార్పొరేట్‌ కంపెనీలు క్రియాశీలక పాత్రపోసించాలని భావిస్తోంది. ఈ మేరకు నోటిఫికేసన్‌ను కూడా విడుదల చేసింది.

విద్యా ప్రమాణాల మెరుగుదల, వయోజన విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ, సామాజిక మౌలిక వసతుల కల్పన, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం, స్వయం ఉపాధి, పొందాలనుకునే ఔత్సాహికులకు ఉపకరించే వివిధ రంగాల్లో శిక్షణలో చురుకైన పాత్ర పోషించాలని అందులో కోరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీకి పెద్దపీట వేస్తుండడంతో తమ నోటిఫికేసన్‌కు స్పందన అద్భుతంగా వస్తుందని ఊహిస్తోంది.