Begin typing your search above and press return to search.

గ్యాంగ్ రేప్ బాధితురాలి వీడియో వైరల్ వెనుక ఒక కార్పొరేటర్

By:  Tupaki Desk   |   7 Jun 2022 3:28 AM GMT
గ్యాంగ్ రేప్ బాధితురాలి వీడియో వైరల్ వెనుక ఒక కార్పొరేటర్
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ నకు సంబంధించిన కీలక అంశం ఒకటి బయటకు వచ్చింది. పబ్ నకు వచ్చిన మైనర్ బాలికను పరిచయం చేసుకొని.. స్నేహాన్ని నటించి.. మాయ మాటలతో బేకరీకి తీసుకెళ్లిన యువకులు.. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం తెలిసిందే. ఈ ఉదంతం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉదంతంలో బాధితురాలికి సంబంధించిన ఒక వీడియో బయటకురావటం.. తీవ్రంగా వైరల్ గా మారటం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా దారుణమైన విషయాన్ని పోలీసులు గుర్తించారు.

సాధారణంగా సున్నితమైన గ్యాంగ్ రేప్ లాంటి దారుణ ఉదంతాలు చోటు చేసుకున్నప్పుడు.. వాటి విషయంలో అత్యంత గోపత్య పాటిస్తారు. బాధితురాలి వివరాల్ని తెలీకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

అదే సమయంలో.. బాధితురాలి పేరుతో పాటు.. ఆమెకు సంబంధించిన అన్ని వివరాల్ని అస్సలు బయటకు రానివ్వరు. షాకింగ్ అంశం ఏమంటే..తాజా ఉదంతంలో బాధితురాలికి సంబంధించిన ఒక వీడియో వైరల్ కావటం.. కొత్త సందేహాలకు తావిచ్చేలా చేయటం చేసింది. ఈ వీడియో లీక్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఎందుకిలా జరిగింది? బాధితురాలి ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉన్న ఈ వీడియో ఎలా లీకైంది? దాని వెనుక ఎవరు ఉన్నారు? లాంటి అంశాలపై పోలీసులు నజర్ వేశారు.

బాధితురాలిని కార్లో తీసుకెళ్లే వేళలో తీసిన ఈ వీడియో.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు సైతం తన ప్రెస్ మీట్ లో వీటిని విడుదల చేయటం.. అనంతరం పలువురు అభ్యంతరం చేసిన నేపథ్యంలో దాన్ని షేర్ చేయొద్దని ఆయనే స్వయంగా చెప్పటం తెలిసిందే. అయితే.. తాను ఆ వీడియోను విడుదల చేసే విషయంలో తప్పు చేయలేదనిఆయన వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వీడియో వైరల్ కావటం వెనుక అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ ఒకరు ఉన్నట్లుగా చెబుతున్నారు. గ్యాంగ్ రేప్ ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్ని రక్షించుకునేందుకు ఒక కార్పొరేటర్.. తమకు అనుకూలంగా ఉన్న వీడియోను కట్ చేసి.. దాన్ని వైరల్ చేశారు. ఇదంతా తమకు చెందిన నిందితుల్ని రక్షించుకునేందుకే ఇలాంటి ప్రయత్నం చేసినట్లుగా గుర్తించారు. ఈ వీడియోను ఎడిట్ చేసి.. కట్ చేయించి పలు గ్రూపుల్లో పోస్టు చేయించటం ద్వారా.. వైరల్ అయ్యేలా చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు.. సదరు కార్పొరేటర్ పై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.