Begin typing your search above and press return to search.

మళ్లీ అదే కథ.. కాంగ్రెస్ కు మరో వ్యథ.!

By:  Tupaki Desk   |   11 Feb 2020 1:30 AM GMT
మళ్లీ అదే కథ.. కాంగ్రెస్ కు మరో వ్యథ.!
X
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. వైఎస్ హయాంలో దాదాపు ఒకటిరెండు తప్పితే అన్ని నియోజకవర్గాలు కాంగ్రెసోళ్లవే.. కార్పొరేషన్ అధ్యక్ష పదవులను సైతం దక్కించుకున్న కాంగ్రెస్ కిందటి ఎన్నికల్లో ఇవే కార్పొరేషన్ పదవులను దక్కించుకునేందుకు నానాతంటాలు పడాల్సి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది అనుకుంటే ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రభావం చూపుతుందని భావించిన అక్కడ కూడా నామమాత్ర పోటీతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవడం వల్లనే వ్యతిరేక ఫలితాలు వచ్చాయని పలువురు నేతలు చెబుతున్నారు. సరైన ప్రణాళికలు సిద్ధం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి మరిన్ని మున్సిపల్ స్థానాలు దక్కేవని చెబుతున్నారు.

*‘సహకారం’ దక్కేనా..
త్వరలో రాబోయే సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి సత్తా చాటుతుందని కొందరు నేతలు చెబుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఉన్నాయి. పెద్దపల్లి నియోకవర్గంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు కాంగ్రెస్ తరఫున సహకార ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. అయితే కిందటి మున్సిపల్ ఎన్నికల్లో వీరివురు మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోక పోవడం వల్లనే కాంగ్రెస్ అనుకున్నంత సీట్లు దక్కించుకో లేదని కార్యకర్తలు చెబుతున్నారు.

అయితే ఈసారైనా ఎలాగైలా సహకార ఎన్నికల్లో సత్తాచాటి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పునర్వైభవం తేవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ లోని నేతలంతా కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే మున్సిపల్ ఎన్నికల విజయంతో జోరు మీదన్న అధికార పార్టీకి కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇస్తారన్నది సందేహంగా మారింది. కొన్ని సీట్లైనా గెలిచి సత్తా చాటాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి నేతల నుంచి ‘సహకారం’ దక్కేనో లేదో త్వరలోనే వెల్లడి కానుంది.