Begin typing your search above and press return to search.

తన 'గుంట'........తానే 'మాగుంట'

By:  Tupaki Desk   |   10 Sep 2018 8:34 AM GMT
తన గుంట........తానే మాగుంట
X
రాజకీయాలలో హత్యలు ఉండవు. ఉండేవన్నీ ఆత్మహత్యాలే. ఒకసారి అధికారంలోకి వచ్చాక తనను కాపాడుకోవడం అందరి విధి. ఇందుకోసం అందరితోను మంచిగా ఉండాలి. కనీసం మంచిగా ఉన్నట్లు నటించాలి. అలా చేయకపోతే పదవులను దాంతో పాటు సన్నిహితులను కూడా కోల్పోవాల్సి వస్తుంది. నిన్నటి దాక మంచిగా ఉన్నవారు హఠాత్తుగా శత్రువులౌవుతారు. ఈ శత్రుత్వం సరిగ్గా ఎన్నికల సమయానికి బయటపడుతుంది. అంతే ..... పదవికి దూరం కావడమో ఎన్నికలలో ఓటమి చెందడమో జరుగుతుంది. జూబ్లీ హిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. జూబ్లీ హిల్స్‌లో కార్పొరేటర్లు ఎవరూ మాగంటి గోపినాథ్‌కు సహకరించే వాతవరణం కనిపించటం లేదు. ఇప్పటికే నలుగురు కార్పొరేటర్లు బహిరంగంగానే మాగంటి గోపినాథ్‌ను వ్యతిరేకిస్తున్నారు. తెలుగుదేశం నుంచి గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన మాగంటి పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోకి ఆయన రావడాన్ని తొలి నుంచి వ్యతిరేకించిన వారు ఇప్పుడు ఎన్నికల సమయంలో ఆ వ్యతిరేకతను మరింత పెంచుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి భారీ ఎత్తున నిర్వహించిన ప్రగతి నివేదన సభలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పార్టీ నాయకులతో కార్పొరేటర్లతో మమైకమవ్వాలని ప్రయత్నించారు. అయితే ఆయన ప్రయత్నాలను ఫలించలేదు. ప్రగతి నివేదన సభలో సభ ముందు వరకూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ స్దాయిలో విభేదాలు ఉన్నాయని అధిష్టానం ఊహించలేదు. ప్రగతి నివేదన సభలో ఇవి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. దీంతో జూబ్లీ హిల్స్‌లో ఏఏ నాయకులు మధ్య విభేదాలు ఉన్నాయి. ఎవరెవరు అనైక్యంగా ఉన్నారు వంటి అంశాలపై పార్టీ ద్రుష్టి సారించింది. మాగంటి గోపినాథ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడని దీంతో మాగంటిని వీలున్నంత దూరం ఉంచాలని తెరాస నాయకులు అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనాయకత్వం కూడా మాగంటి కదలికలపై ద్రుష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు జూబ్లీ హిల్స్ నుంచి తెరాస నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న వారి సం‌ఖ్య ఎక్కువే ఉంది. ఇవన్నీ ద్రుష్టిలో పెట్టుకున్న అధిష్టానం మాగంటి గోపినాథ్ అభ్యర్దిత్వంపై ఆలోచించే అవకాశం ఉంది.