Begin typing your search above and press return to search.

గవర్నర్ వద్దకు షరీఫ్..వైసీపీకి ‘మండలి’ షాక్ తప్పదా?

By:  Tupaki Desk   |   18 Feb 2020 4:53 PM GMT
గవర్నర్ వద్దకు షరీఫ్..వైసీపీకి ‘మండలి’ షాక్ తప్పదా?
X
అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన శాసనమండలిని రద్దు చేస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంలో అధికార వైసీపీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా విపక్ష టీడీపీ వ్యూహాత్మకంగా కదుపుతున్న పావులు... వైసీపీకి దెబ్బేసేలానే ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దిశగా మంగళవారం ఇటు విజయవాడలోనే కాకుండా అటు ఢిల్లీలోనూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ మంగళవారం రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. అంతేకాకుండా కేంద్రం పెద్దల అనుమతితోనే షరీఫ్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ లభించిందనే దిశగానూ ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు శాసనమండలి రద్దును అడ్డుకునే క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీలు కేంద్రం పెద్దలను కలిసే దిశగా ఢిల్లీకి వెళ్లిన వైనం కూడా వైసీపీకి దెబ్బ పడేలానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

శాసనమండలి చైర్మన్ హోదాలో తాను రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపి... ఆయా పార్టీల సభ్యులతో సదరు కమిటీలను ఏర్పాటు చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను మండలి కార్యదర్శి పట్టించుకోవడం లేదని, ఇప్పటికే దీనిపై తాను రెండు పర్యాయాలు ఆదేశాలు జారీ చేసినా... కార్యదర్శి వాటిని అమలు చేయలేదని గవర్నర్ కు షరీఫ్ ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇలా మండలి చైర్మన్ ఇచ్చిన ఆదేశాలను కార్యదర్శి తిరస్కరించడం ఇప్పటిదాకా చరిత్రలోనే లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన కార్యదర్శిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా షరీఫ్ కోరారు. గవర్నర్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన షరీఫ్... తాను చెప్పిన విషయాలన్నింటినీ గవర్నర్ సావదానంగా విన్నారని, కార్యదర్శిపై చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని కూడా చెప్పారు. అదే జరిగితే... మండలిని కేంద్రం రద్దు చేసే మాట అటుంచితే... రాష్ట్ర స్థాయిలోనే మండలి రద్దు నిర్ణయానికి బ్రేకులు పడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే... శాసనమండలి రద్దుకు బీజేపీ కూడా అంతగా సానుకూలంగా ఏమీ లేదనే చెప్పాలి. ఏపీ అసెంబ్లీలో బీజేపీకి అసలు ప్రాతినిధ్యమే లేకపోగా... మండలిలో ఆ పార్టీకి ఇద్దరు సభ్యులున్నారు. ఇప్పుడు జగన్ సర్కారు ప్రతిపాదించినట్లుగా మండలి రద్దుకు కేంద్రం కూడా ఓకే అంటే... ఏపీ చట్టసభల్లో అసలు బీజేపీకి స్థానమే లేకుండా పోతుంది. ఈ లెక్కన మండలి రద్దుకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమనే చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే జగన్ ఢిల్లీకి వెళ్లి అటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినా... మండలి రద్దుకు వారిద్దరూ అంత సానుకూలంగా స్పందిచలేదన్న వాదనలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. మండలి చైర్మన్ కు మొన్నటిదాకా అపాయింట్ మెంటే ఇవ్వకుండా సాగిన గవర్నర్... ఇప్పుడు కేంద్రం పెద్దల అనుమతితోనే షరీఫ్ కు అపాయింట్ మెంట్ ఇచ్చారని కూడా విశ్వసనీయ సమాచారం. మొత్తంగా అధికార వికేంద్రీకరణను అడ్డుకున్న మండలిని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో వైసీపీకి ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.