Begin typing your search above and press return to search.

కొత్త లెక్క; దేశంలో ఎవరెంత లంచం ఇస్తున్నారంటే..!

By:  Tupaki Desk   |   24 May 2015 6:34 AM GMT
కొత్త లెక్క; దేశంలో ఎవరెంత లంచం ఇస్తున్నారంటే..!
X
లంచం కనిపించని భారతం ఎక్కడా కనిపించదు. అవినీతి.. లంచగొండితనంలో దేశానికి ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద జాడ్యంలా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ లంచం తీవ్రత ఏ స్థాయిలో ఉందన్న విషయంపై నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ తాజాగా ఒక ఆసక్తికరమైన నివేదికను వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని ప్రజలంతా వారూ.. వీరు అన్న తేడా లేకుండా అందరూ లంచాలు ఇస్తున్నారని తేల్చింది. అంతేకాదు.. గ్రామాల్లో లంచం తీవ్రత తక్కువగానూ.. పట్టణాలు.. నగరాల్లో లంచం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని లెక్క కట్టింది.

సరాసరిన.. ఏడాది కాలంలో భారతీయులు ఎంత మొత్తంలో లంచాలు ఇస్తున్నారన్న దానిపై ఒక స్పష్టత ఇస్తూ.. వివరాలు వెల్లడించింది. వీరు చెబుతున్న దాని ప్రకారం.. పట్టణ.. నగర ప్రాంతానికి చెందిన భారతీయులు ఏడాదికి రూ.4,400 చొప్పున.. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు ఏడాదికి.. రూ.2,900 మేర లంచం ఇస్తున్నట్లు తేల్చారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు.. పథకాలకు సంబంధించి లంచాలు ఇవ్వాల్సి వస్తోందని తేల్చారు.

అంతేకాదు. ట్రాన్సఫర్ల కోసం సిటీలోని ఎంప్లాయిస్‌ ఏడాదికి సగటున రూ.18వేలు లంచంగా ఇస్తున్నారని తేల్చారు. పోలీసులకు ఏడాదికి రూ.600 మేర చేయి తడుపుతారని చెప్పారు. పేదలకు కేటాయించిన వివిధ పథకాల్లో లబ్థిదారులకు అందేందుకుద అధికారులకు లంచం తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తోందని పేర్కొంది. ప్రనభుత్వ పథకాలకే కాదు.. విద్యార్థుల స్కాలర్‌ షిప్పులకూ చేతులు తడపాల్సి వస్తోందని చెబుతున్నారు.

లంచాలు ఎక్కువగా ఇచ్చే భారతీయ నగరాల్లో పాట్నా.. భువనేశ్వర్‌.. చెన్నై.. హైదరాబాద్‌.. ఫూణె నగరాలు ఉన్నాయని తాజా అధ్యయనం పేర్కొంది. లంచాలు తీసుకునే శాఖల్లో ఆడ్మినిస్ట్రేషన్‌.. పోలీసులు ముందు వరుసలో ఉన్నాయని చెబుతున్నారు.