Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్ డౌన్ ... నేడో రేపో నొటిఫికేషన్ ..?

By:  Tupaki Desk   |   7 Jun 2022 10:28 AM GMT
రాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్ డౌన్ ... నేడో రేపో నొటిఫికేషన్ ..?
X
దేశ ప్రధమ పౌరుడి ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సర్వసన్నద్ధంగా ఉంది. ఈ మేరకు ఈసీ టోటల్ కసరత్తు పూర్తి చేసింది. జూలైలో రాష్ట్రపతి ఎన్నికలు జరగాలంటే ఇవాళ రేపటి లోగా నోటిఫికేషన్ జారీ చేయడం తప్పనిసరి అంటున్నారు.

ఇక గతసారి చూస్తే 2017లో జూన్ 7వ తేదీనే ఈసీ రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో జూన్ 14 నుంచి 28 దాకా నామినేషన్ల స్వీకరణకు గడువు ఇచ్చారు. జూలై 17న పోలింగ్ జరిగింది. 20న కౌంటింగ్ జరిగింది. ఇక రామ్ నాధ్ కోవింది కొత్త రాష్ట్రపతిగా నాడు ఎన్నిక అయ్యారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి మీరాకుమర్ ని ఓడించారు.

దాంతో ఈసారి కూడా దాదాపుగా ఇదే షెడ్యూల్ లో రాష్ట్రపతి ఎన్నిక ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఇదిలా ఉంటే వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి చూస్తే ఎన్డీయే సేఫ్ జోన్ లో ఉండగా యూపీయే శిబిరంలో ఇంకా గందరగోళం కొనసాగుతోంది.

బీజేపీ అన్ని రకాలుగా వ్యూహాలతో తయారుగా ఉంది. రాష్ట్రపతిభవన్ లో కూర్చోబోయే తదుపరి రాష్ట్రపతి తాము ప్రతిపాదించిన వారే కావాలన్న బీజేపీ పంతం మరోసారి నెరవేరబోతోంది అని చెప్పుకోవాలి. ఎలక్ట్రోల్ కాలేజ్ లో ఈ రోజుకు చూస్తే ఎన్డీయే బలం పూర్తిగా ఉంది ఈ మధ్యనే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ని ఢిల్లీ పిలిపించుకుని కేంద్ర పెద్దలు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల తేడాలో ఏపీ సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో మాట్లాడి వచ్చారు అంటున్నారు.

బీజేపీకి వైసీపీ బిజూ జనతాదళ్ పార్టీల మద్దతు సంపూర్ణంగా ఉందని అంటున్నారు. దాంతో ఈ ఎన్నికల్లో గెలవడం అన్నది నల్లేరు మీద నడకే అని తేలిపోతోంది. మరి ఈసారి అయ్యే రాష్ట్రపతి ఎవరూ అన్నదే ఇపుడు అందరిలో ఆసక్తిని రేపుతున్న అంశం. ఈ విషయంలో బీజేపీ కనీసంగా నోరు మెదపడంలేదు. అయితే గత ఎన్నికల మాదిరిగానే అనూహ్యమైన అభ్యర్ధినే తెర మీదకు తీసుకురావచ్చు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే రాష్ట్రపతి ఎన్నికలలో సత్తా చాటుతామని చెబుతూ వచ్చిన యూపీయే కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ ఐక్యతగా ముందుకు రాలేకపోతున్నారు. ఏడాదిగా రాష్ట్రపతి ఎన్నికలు అంటూ ఊరించి తీరా దగ్గరపడ్డాక సరైన వ్యూహ రచన చేయలేకపోతున్నారు అంటున్నారు. అదే బీజేపీకి అడ్వాంటేజ్ గా మారింది అని అంటున్నారు. చూడాలి మరి.