Begin typing your search above and press return to search.

త‌న‌పై విప‌క్షాల విమ‌ర్శ‌ల్ని ఓకే చేసిన మోడీ?

By:  Tupaki Desk   |   26 Sep 2017 6:00 AM GMT
త‌న‌పై విప‌క్షాల విమ‌ర్శ‌ల్ని ఓకే చేసిన మోడీ?
X
ఎప్ప‌టికిప్పుడు కొత్త కొత్త‌గా విష‌యాలు చెప్ప‌ట‌మే కాదు.. తాను చేసిన ప‌నుల వైఫ‌ల్యం గురించి ఒప్పుకోవ‌టానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. ప్ర‌ధాని మోడీ అయితే త‌న త‌ప్పుల్ని ఇప్ప‌టివ‌ర‌కూ బ‌హిరంగంగా ఒప్పుకున్న‌ది లేదు. ఆ మాట‌కు వ‌స్తే తాజాగా కూడా మోడీ ఏమీ ఒప్పుకోలేదు. అయితే.. త‌న‌పై త‌ర‌చూ విప‌క్షాలు చేసే విమ‌ర్శ‌ల్ని తొలిసారి ఒప్పుకున్న‌ట్లుగా మాట్లాడ‌టం ఇప్పుడు ఆస‌క్తికరంగా మారింది.

తాను తీసుకున్న సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలుగా ఎప్ప‌టిక‌ప్పుడు గొప్ప‌గా చెప్పుకునే పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ నిర్ణ‌యాల కార‌ణంగా దేశ ఆర్థిక మంద‌గ‌మ‌నం చోటు చేసుకుందంటూ విమ‌ర్శించే విమ‌ర్శ‌ల్లో నిజం లేక‌పోలేద‌న్న విష‌యాన్ని తాజాగా మోడీ ఒప్పేసుకున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీ కార‌ణంగా ఆర్థిక వ్య‌వ‌స్థ కొద్దిగా మంద‌గించిన మాట నిజ‌మేన‌ని ఆయ‌న ఒప్పుకున్నారు. దీర్ఘ‌కాలంలో దూర‌దృష్టితో తీసుకున్న నిర్ణ‌యాలుగా అభివ‌ర్ణించారు.

త్వ‌ర‌లోనే ఆర్థికంగా ఉన్న అన్ని అవ‌రోధాల్ని అధిగ‌మించి.. అంద‌రూ ఆసూయ ప‌డేలా అభివృద్ధి చెందుతామ‌న్నారు. బీజేపీ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో పార్టీ ప్ర‌తినిధుల‌ను ఉద్దేశించి మోడీ ప్ర‌సంగించారు. ఈ స‌భ‌కు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు.. మూడు వేల మంది ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

త‌న‌కు చుట్టాలు ఎవ‌రూ లేర‌ని.. ఎవ‌రి కోసం తాను అవినీతికి పాల్ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకున్నారు. అవినీతికి పాల్ప‌డిన వారిని వ‌ద‌లాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అవినీతి గురించి తాను గ‌ట్టిగా మాట్లాడితే స‌భ‌లో ఉన్న కొంద‌రికి ఇబ్బందిక‌రంగా ఉంటుంద‌ని త‌న‌కుతెలుస‌న్నారు.

త‌న ప్ర‌థ‌మ ప్రాధాన్యం దేశ‌మ‌ని.. ఆ త‌ర్వాతే పార్టీ అన్న మోడీ.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. అవినీతిని అంతం చేయ‌ట‌మే అంద‌రి ల‌క్ష్యం కావాల‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌టంలో బీజేపీ ఉన్నంత చురుగ్గా మ‌రెవ‌రూ లేర‌న్న మోడీ.. డోక్లామ్ ఇష్యూను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించుకున్న విష‌యాన్ని వెల్ల‌డించారు మొత్తానికి తాను తీసుకున్న రెండు అతి పెద్ద నిర్ణ‌యాలు కార‌ణంగా ఆర్థిక మంద‌గ‌మ‌నం చోటు చేసుకుంద‌న్న విష‌యాన్ని మోడీ ప‌రోక్షంగా ఒప్పుకోవటం.. కొంచెం అన్న మాట మోడీ నోటి నుంచే వ‌చ్చిందంటే.. దాని వాస్త‌వ ప్ర‌భావం ఎంత ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.