Begin typing your search above and press return to search.

సీబీఐ...ఈడీ...ఐటీ...సిట్... ఇవేనా దేశంలో పార్టీలు...?

By:  Tupaki Desk   |   7 Dec 2022 6:10 AM GMT
సీబీఐ...ఈడీ...ఐటీ...సిట్... ఇవేనా దేశంలో పార్టీలు...?
X
భారతదేశం అంటేనే ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో గుర్తింపు ఉన్నవి లేనివి ఇలా చాలా ఉన్నాయి. ఈసీ వద్ద పెద్ద చిట్టావే ఉంది. పూటకో పార్టీ పుడుతున్న దేశం మనది. అయితే ఇపుడు దేశంలోని అన్ని పార్టీలు ఉన్నా కూడా వాటిని నడిపిస్తోంది మాత్రం అచ్చంగా ఆ సంస్థలేనట. వెటకారం కాదు కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తే కనుక ఇదే విషయం అర్ధం అవుతోంది అంటున్నారు.

ఇంతకీ దేశాన్ని ఈ రోజు నడిపించే ఆ పార్టీలు ఏంటి అని చూస్తే కనుక చిత్రమే అనిపిస్తుంది. మరో సమయంలో నిజమే కదా అన్నదీ అనిపిస్తుంది. ఇంతకీ ఆ పార్టీలు ఏంటి అంటే అవే సీబీఐ, ఈడీ, ఐటీ, సిట్ ఇవే ఇపుడు దేశాన్ని, దేశంలోని రాజకీయాన్ని రాజకీయ పార్టీలను నడిపించే శక్తులు అని చాలా ఈజీగా తేల్చేస్తున్నారు.

ఈ విచారణ సంస్థల మీద ఇపుడు పెద్ద ఎత్తున గోల గోల కూడా అవుతోంది. ఎందుకంటే ఏదో మూల ఏదో నాయకుడి మీద ఈ విచారణ సంస్థలు దాడులు చేస్తున్నాయి. అంతే కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అన్నింటి మీద దాడులు చేస్తూ పోతున్నాయి. దాంతో రాజకీయ పార్టీలు గగ్గోలు మామూలుగా ఉండడంలేదు. నిన్నటి దాకా ఒక లెక్కన ఉండే పార్టీలు ఈ సంస్థలు రంగ ప్రవేశం చేశాక మరో విధంగా మారుతున్నాయి.

ఈ దెబ్బకు లెక్కలు జమలూ అన్నీ కూడా తేలిపోతున్నాయి. ఇక చూస్తే ఈడీ, సీబీఐ, ఈటీ వంటివి కేంద్ర దర్యాప్తు సంస్థలు, సిట్ అన్నది రాష్ట్రానికి సంబంధించినది. అయితే ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల అవినీతిని బయటపెట్టేందుకు పనిచేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇది బయటకు కనిపించే విషయం. అసలైన వాస్తవం ఏంటి అంటే తాము టార్గెట్ చేసిన రాజకీయ పార్టీలను తామే నియంత్రించాలనుకోవడం. తాము అనుకున్నట్లుగా వాటిని నడిపించాలనుకోవడం.

ఈ ఆరాటం ఈ తాపత్రయం రాజకీయ పార్టీల యజమానులకు ఎక్కువ అయినపుడే ఈ దాడులు జరుగుతున్నాయని ప్రచారం విమర్శలు ఇపుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక గతంలో ఎపుడో కానీ కనిపించని ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఇపుడు దాదాపుగా ప్రతీ రోజూ కనిపిస్తున్నాయి. వాటికి చేతినిండా పని దొరుకుతోంది. అందునా ప్రత్యేకించి తెలుగు నేల మీద ఉన్న రెండు రాష్ట్రాలలోనూ ఈ దర్యాప్తు సంస్థలు ఫుల్ బిజీగా ఉంటున్నార్యి.

ఒక చోట తీగ లాగితే మరోచోట డొంక కదులుతోంది. ఒక చోట వివరాలు సేకరిస్తే అందులో మరో పది అడ్రస్సులు దొరుకుతున్నాయి. దాంతో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా ఈ దాడులకు సమయం సరిపోవడంలేదు అంటున్నారు. ఒక విధంగా ఆలోచించి చూస్తే గత రెండు మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో ఈ దర్యాప్తు సంస్థల అలజడి, అలికిడి లేని రోజే లేదు అంటే ఆశ్చర్యం కానే కాదు అని అంటున్నారు. మరి దీని వెనక కేంద్ర పెద్దలు ఉన్నారని, వారి పురమాయింపుతోనే ఇలా జరుగుతోందని బాధిత జనాలు, వారున్న పార్టీలూ గోల పెడుతున్నాయి.

అయితే అవినీతిని ప్రక్షాళన చేయడానికే ఈ సంస్థలు ఇపుడు రంగంలోకి దిగాయని అలుపూ సొలుపూ లేకుండా ఇలా దాడులు చేస్తూ తప్పులు చేసిన వారిని దండించే పనిలో పడ్డాయని అంటున్నారు. అది బాగానే ఉన్నా ఇన్నాళ్ళూ లేనిది. ఇన్నేళ్ళూ కానిది ఇపుడే ఇలా సడెన్ గా రాజకీయ జనాల మీద పడ్డారేంటి అన్న డౌట్లు ఎవరికీ రాకూడదు, వచ్చినా జవాబు వారి దొరకదు అంతే. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా ఉంది. కేవలం అవినీతి అది కూడా రాజకీయ అవినీతి కేవలం తెలుగు రాష్ట్రాలోనే చోటు చేసుకుందా అన్నది. దానికీ జవాబు అయితే ఎవరూ చెప్పలేరు.

అయితే అవినీతి ఎక్కడ ఉన్నా వెలికితీయాల్సిందే. ఆ విషయంలో ఎవరూ ఆక్షేపించరు. కానీ తమ వారు పర వారు అని భేదాలు పెట్టుకుని ఇంతకాలం ఊరుకున్నారా ఇపుడే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అదను చూసి మరీ ఈ దాడులను చేయిస్తున్నారా అన్న సవాలక్ష సందేహాలు సామాన్య జనాలలో రావడం వల్లనే ఈ ఘనత వహించిన సంస్థలు సైతం కొంత ఇబ్బంది పడుతున్నాయి. విమర్శలను ఎదుర్కొంటున్నాయి. నిజానికి వీటికే పూర్తి స్వేచ్చ ఇచ్చి వదిలిపెడితే ఈ భారత దేశం మొత్తం గజానికో అవినీతిపరుడిని వెతికి పట్టుకోలేవా. వారి గుట్టు బయటపెట్టలేవా. కానీ రాజకీయ రంగు పులుముకుంటూ సాగుతున్నాయి కాబట్టే ఈ దాడుల పట్ల విశ్వసనీయత తగ్గుతోంది, విమర్శల జోరు హెచ్చుతోంది అని అంతా అంటున్నారు. అదీ విషయం.