Begin typing your search above and press return to search.

ఏపీలో ఆగని కాల్ మనీ వేధింపులు..దంపతుల ఆత్మహత్య?

By:  Tupaki Desk   |   18 Dec 2019 9:03 AM GMT
ఏపీలో ఆగని కాల్ మనీ వేధింపులు..దంపతుల ఆత్మహత్య?
X
గత కొన్నిరోజుల క్రితం ఏపీలో వరుసగా కాల్ మనీ రాక్షసుల చిత్ర హింసలకు చాలామంది బలైపోయారు. వేలల్లో అవసరం కోసం డబ్బు తీసుకుంటే ..అదే అదునుగా చేసుకొని వడ్డీ - వడ్డీకి వడ్డీ - చక్రవడ్డీ వేసి లక్షల్లో ఇవ్వాలని వారిని వ్యాపారస్తులు బెదిరిస్తున్నారు. వారు అడిగినంత ఇవ్వలేక చాలామంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారడంతో కొన్ని రోజులుగా కాల్ మనీ రాక్షసుల అరాచకాలు తగ్గిపోయాయి. కానీ , తాజాగా మరోసారి కాల్ మనీ వ్యవహారం బయటపడింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో మరోసారి కాల్‌ మనీ దందా భయాందోళనకు గురిచేస్తోంది. తీసుకున్న అప్పుకు లక్షలకు లక్షలు వడ్డీలు కట్టినా వేధిస్తున్నారంటూ రెండు రోజుల కిందట వెంకట్ అనే యువకుడు తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ ఘటన మరువకముందే మంగళగిరి మండలంలో తాపీ మేస్త్రీ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు భరించలేక మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ పోలిశెట్టి పూర్ణచంద్రరావు - లక్ష్మి దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చనిపోయే ముందు పూర్ణచంద్రరావు దంపతులు రాసిన సూసైడ్ లెటర్.. వడ్డీ వ్యాపారుల అరాచకాలను కళ్లకు కడుతోంది.

వడ్డీ వ్యాపారులు తమను ఎలా వేధించారో.. పది పేజీల లేఖలో వాళ్లు వివరించారు. కాల్‌ మనీ రక్కసి కారణంగానే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు విపులంగా రాసిపెట్టారు. పూర్ణచంద్రరావు తాపీ మేస్త్రీ. పనుల్లేక పోవడంతో అప్పులపాలయ్యాడు. వడ్డీ వ్యాపారుల వద్ద కేవలం రూ.30 వేలు ఒకసారి, 20వేలు మరోసారి అప్పు తీసుకున్నాడు. 30వేల అప్పుకు లక్షన్నర.. ఇరవై వేల రూపాయలకు సుమారు లక్ష రూపాయలు కట్టాలని వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురిచేయడంతో దిక్కుతోచని పరిస్థితిలో తనువు చాలించాడు.

ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రూ.10 నుంచి రూ.15ల వడ్డీ కట్టాల్సిందేనని లేకుంటే భార్య - కోడలు - ఆఖరికి చిన్నారి మనవరాలితో కూడా వ్యభిచారం చేయిస్తామని పూర్ణచంద్రరావును బెదిరించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వడ్డీ వ్యాపారస్తులు తీవ్ర మానసిక క్షోభకు గురిచేయడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. వేధింపులకు పాల్పడిన వారి పేర్లతో సహా బయటపెట్టినట్లు సమాచారం. ఆ లేఖని స్వాధీనం చేసుకునం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.