Begin typing your search above and press return to search.

పిల్లికి ఆపరేషన్ కోసం రూ.19లక్షలు

By:  Tupaki Desk   |   20 Aug 2015 6:08 AM GMT
పిల్లికి ఆపరేషన్ కోసం రూ.19లక్షలు
X
తమ సుఖాల కోసం పుట్టిన పిల్లల్ని సైతం కడదేర్చే పాడు మనుషులు ఉన్న కాలంలో.. కొన్ని ఉదంతాలు వింటే విస్మయం కలగక మానదు. పేగు పంచుకొని పుట్టిన బిడ్డల విషయంలోనూ అంతులేని కర్కసత్వాన్ని ప్రదర్శిస్తున్న కొందరి కారణంగా.. మానవత్వం అంటూ ఏమీ లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. కొన్ని ఉదంతాలు బయటకు వచ్చి.. ఇంకా ‘‘మనిషి’’ చచ్చిపోలేదని.. అతడి మానవత్వం ఇంకా ఉందని చాటి చెప్పే ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా అలాంటి ఘటనే అమెరికాలో ఒకటి చోటు చేసుకుంది. ఈ దేశానికి చెందిన గాన్సియర్ దంపతులు ఒక పిల్లిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. నిజానికి ఆ పిల్లి వారికి చిత్రంగా తారసపడింది. కొన్నేళ్ల క్రితం రుమేనియాలో ప్రాణపాయ స్థితిలో ఉండగా ఈ పిల్లి ఈ దంపతులకు దొరికింది. దాన్ని తెచ్చుకొని ‘‘ఒకీ’’ అన్న పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

ఇటీవల దానికి రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో తల్లడిల్లిపోయిన వారు.. దాన్ని బతికించేందుకు విపరీతంగా ప్రయత్నించారు. చివరకు వేరే పిల్లి కిడ్నీతీసుకొని దాన్నికి ఆపరేషన్ చేయొచ్చన్న వైద్యుల మాటతో మరో ఆలోచన లేకుండా ఓకే అనేశారు.

అయితే.. ఆపరేషన్ కు అయ్యే ఖర్చు రూ.19లక్షలుగా తేలింది. ఇంతా చేస్తే గాన్సియర్ దంపతులు ఆర్థికంగా అంత సంపన్నులేమీ కాదు. వారు సొంతిల్లు కొనుక్కోవటానికి దాచి ఉంచిన డబ్బుని .. తాము అల్లారు ముద్దుగా పెంచుకునే పిల్లి కోసం వెచ్చించారు. ఆపరేషన్ విజయవంతమైంది. ఇంత శ్రమపడితే.. ఈ పిల్లి రెండు.. మూడేళ్లకు మించి బతికే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఎన్నాళ్లు బతుకుతుందన్న లెక్కల కంటే కూడా.. తాము అల్లారు ముద్దగా పెంచుకునే పిల్లి తమతో ఉండాలన్న ఒకే ఒక ఉద్దేశ్యంతో ఇంత రిస్క్ తీసుకున్న గాన్సియర్ దంపతులు మానవత్వానికి ప్రతీకలు కదూ.