Begin typing your search above and press return to search.

మ‌గాళ్ల కోసం పోరాడాల్సిన త‌రుణం వ‌చ్చేసింద‌ట‌!

By:  Tupaki Desk   |   31 Oct 2017 11:30 PM GMT
మ‌గాళ్ల కోసం పోరాడాల్సిన త‌రుణం వ‌చ్చేసింద‌ట‌!
X
సీన్ రివ‌ర్స్ అంటే ఇదేనేమో. దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ అబ‌ల‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని గ‌గ్గోలు పెడుతున్న మ‌హిళా - ప్ర‌జా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేస్తూనే ఉన్నాయి. దేశంలో ఏ మూల మ‌హిళ‌ల‌కు అన్యాయం జ‌రిగింద‌ని తెలిసినా... అక్క‌డ క్ష‌ణాల్లో వాలిపోయే మ‌హిళా సంఘాలు.. బాధితుల ప‌క్షాన తామే వ‌కాల్తా పుచ్చుకుని మ‌రీ పోరాటం మొద‌లెడ‌తారు. అబ‌ల‌లుగా మ‌నం భావించే మ‌హిళ‌ల‌కు ఆ మాత్రం అండ అవ‌స‌ర‌మ‌ని అంద‌రూ ఒప్పుకోవాల్సిందే. అయితే అబ‌ల అనే త‌న ప‌దాన్నే ఆస‌రా చేసుకుని... త‌న‌కంటే బ‌లమైన మ‌గాళ్ల‌ను మోసం చేసే కిలాడీ లేడీల విష‌యంలో ఈ మ‌హిళా సంఘాలు ఎందుకు నోరెత్త‌డం లేద‌న్న‌ది ఆన్స‌ర్ లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. అయినా ఇప్పుడు ఈ కొత్త త‌ర‌హా వాద‌న ఎందుకంటారా? దేశ రాజ‌ధాని ఢిల్లీకి చెందిన ఓ కోర్టు నేటి విచార‌ణ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు వింటే నిజంగానే ఈ ప్ర‌స్తావ‌న ఇప్పుడు స‌బ‌బుగానే ఉంద‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు.

ఇక్క‌డ ప్రధానంగా ప్ర‌స్తావించుకోవాల్సిన మ‌రో ఆస‌క్తిక‌ర విష‌య‌మేమిటంటే... మ‌గాళ్ల ప‌క్షాన‌ - కిలాడీ లేడీల‌కు వ్య‌తిరేకంగా పోరు సాగించాల్సిన అవ‌స‌రం వ‌చ్చిందని తీర్పు చెప్పింది ఏ పురుష న్యాయ‌మూర్తో కాదు. ఈ తీర్పు చెప్పింది మ‌హిళా న్యాయ‌మూర్తి నివేదిత అనిల్ శ‌ర్మ‌. అస‌లు ఆ మ‌హిళా న్యాయ‌మూర్తి మ‌గాళ్ల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... మ‌హిళల గౌర‌వం - ప్ర‌తిష్ఠ కోసం పోరాటాలు చేసే వాళ్లు మ‌గ‌వారి విష‌యంలో ఆ ప‌ని ఎందుకు చేయ‌డం లేద‌ని నిల‌దీశారు. అన్యాయానికి గుర‌వుతున్న మ‌గాళ్ల త‌ర‌ఫున పోరాటం చేసే వారు లేని ప్ర‌స్తుత త‌రుణంలో మ‌గాళ్ల కోసం పోరాడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని కూడా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విన‌డానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... స‌ద‌రు మ‌హిళా న్యాయ‌మూర్తి మాటలన్నీ అక్ష‌ర స‌త్యాలే. మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ కోసం ఏర్పాటు చేసిన చ‌ట్టాల‌ను ఆస‌రా చేసుకుని కొంద‌రు మ‌హిళ‌లు... అమాయ‌కులైన మ‌గాళ్ల‌పై కేసులు న‌మోదు చేస్తున్నార‌ని, అయితే ఆ కేసుల్లో ఇరుక్కున్న మ‌గాళ్లు తాము నిర్దోషుల‌మ‌ని నిరూపించుకున్నా కూడా స‌మాజం వారిపై అత్యాచార దోషి అనే ముద్ర‌ను మాత్రం చెరిపేయ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయినా ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చింద‌న్న విష‌యానికి వ‌స్తే... 20 ఏళ్ల క్రితం నమోదైన ఓ అత్యాచార కేసులో నిందితుడు చివరకు నిర్దోషిగా తేలాడు. కోర్టు అతన్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ మ‌హిళా న్యాయమూర్తి మాట్లాడుతూ.. అత్యాచార కేసుల్లో తప్పుడు ఆరోపణలు మగవారికి తీర‌ని అన్యాయం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తమకు రక్షణగా ఉన్న చట్టాలను కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కేసులో నిందితుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని బయటకు వచ్చినప్పటికీ... సమాజం దృష్టిలో అతను అత్యాచార ఆరోపితుడిగానే మిగిలిపోతున్నాడని న్యాయమూర్తి అన్నారు. జీవితం కాలం ఈ అవమానాన్ని అతను భరించాల్సి రావ‌డం చూస్తే చాలా బాధేస్తుంద‌ని కూడా వ్యాఖ్యానించారు. అత్యాచారం జరిగిందని తెలియగానే బాధితురాలికి అండగా నిలిచే ప్రజలు, మహిళా సంఘాలు... ముద్దాయి నిర్దోషి అని తేలిన తర్వాత అతనికి ఎందుకు మద్దతుగా నిలవడం లేదని ఆమె నిల‌దీశారు. మగవారి గౌరవ, మర్యాదలను కాపాడటానికి మహిళా సంఘాలు కూడా ముందుకు రావాలని సూచించారు. మ‌రి ఈ మాట‌లు మ‌హిళా సంఘాల చెవికి విన‌ప‌డ‌తాయో, లేదో చూడాలి.