Begin typing your search above and press return to search.

తరుణ్ తేజ్‌పాల్‌ ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు !

By:  Tupaki Desk   |   21 May 2021 7:30 AM GMT
తరుణ్ తేజ్‌పాల్‌ ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు !
X
అత్యాచారం, లైంగిక‌దాడి ఆరోప‌ణ‌ల‌ కేసులో తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ త‌రుణ్ తేజ్‌పాల్‌ ను గోవా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది.

దీనితో తెహ‌ల్కా మాజీ ఎడిట‌ర్ ఇన్ చీఫ్ త‌రుణ్ తేజ్‌పాల్‌ కి ఈ కేసు నుండి ఎట్ట‌కేల‌కు విముక్తి ల‌భించినట్టు అయ్యింది. ఈ నెల 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉన్నప్పటికీ , రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును జడ్జి వాయిదా వేశారు. తనపై తరుణ్ తేజ్‌పాల్ అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మహిళా జర్నలిస్ట్ 2013లో ఫిర్యాదు చేశారు. గోవాలో జరిగిన ఓ కాన్ఫరెన్స్‌ కు హాజరైనప్పుడు ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తేజ్‌పాల్ అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత మహిళ ఆరోపించింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేశారు.

గోవా కోర్టు ఈ కేసు విచార‌ణ చేప‌ట్టింది. అయితే, త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల‌ను కొట్టివేయాల‌ని తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అదేవిధంగా బెయిల్ పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. దాంతో 2014 జూలై 1 సుప్రీంకోర్టు తేజ్‌పాల్‌కు బెయ‌ల్ మంజూరు చేసింది. కానీ, లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు కొట్టివేయాల‌న్న పిటిష‌న్‌ ను మాత్రం పెండింగ్‌ లో పెట్టింది. దాంతో గోవా కోర్టులో కేసు విచార‌ణ ఆల‌స్య‌మైంది. అయితే 2019లో త‌న‌పై ఆరోప‌ణ‌ల‌ను ర‌ద్దు చేయాల‌న్న‌ త‌రుణ్ తేజ్‌పాల్ పిటిష‌న్‌ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో మ‌ళ్లీ గోవా కోర్టులో ఈ కేసు విచార‌ణ జ‌రిగింది. తాజాగా ఈ కేసులో తీర్పుని వెల్లడించింది.

తరుణ్ తేజ్‌పాల్ కుమార్తె కారా తేజ్‌పాల్ తన తండ్రి తరపున ఒక ప్రకటన చదివి వినిపించారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేశారు.. ఈ న్యాయస్థానం కఠినమైన, నిష్పాక్షిక, న్యాయమైన విచారణ, సీసీటీవీ ఫుటేజ్, ఇతర అంశాలను సమగ్రంగా పరిశీలించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. అలాగే, కరోనాతో చనిపోయిన తన తరఫున న్యాయవాది రాజీవ్ గోమ్స్‌ కు తేజ్‌పాాల్ కృతజ్ఞతలు తెలిపారు. తప్పుడు ఆరోపణలు వల్ల గత ఏడున్నరేళ్లుగా తమ కుటుంబం వేదన అనుభవించింది.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ప్రజా జీవితాన్ని ఇది ఎంతో ప్రభావితం చేసింది అని అన్నారు.