Begin typing your search above and press return to search.

వాడో సైకాలజిస్టు.. ఈ హైదరాబాదీ చేసే చెత్త పని తెలిస్తే నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   4 Sep 2022 5:11 AM GMT
వాడో సైకాలజిస్టు.. ఈ హైదరాబాదీ చేసే చెత్త పని తెలిస్తే నోట మాట రాదంతే
X
గతంలో కొన్ని ప్రొఫెషన్స్ కు చెందిన వారన్నంతనే కొంత గౌరవం ఉండేది. ఇప్పుడు కొందరు ప్రబుద్ధుల పుణ్యమా అని అలాంటివి పోతున్న దుస్థితి. తాజాగా అలాంటి ఉదంతమే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. సైకాలజిస్టుగా హైదరాబాద్ లోని పలు ప్రైవేటు కళాశాలల్లోనూ.. కోచింగ్ సెంటర్లలో ప్రసంగాలు ఇచ్చే బి.పి. నగేశ్ అనే ప్రబుద్ధుడి చీకటి కోణం తాజాగా వెలుగు చూసింది. అతగాడి భాగోతాన్ని షీ టీమ్ బయటపెట్టింది.

హైదరాబాద్ మహానగరంలో పలు విద్యా సంస్థల్లో మోటివేషనల్ స్పీచ్ ల కోసం నగేశ్ క్లాసులు తీసుకుంటూ ఉంటారు. ఇతగాడిది గుంటూరు జిల్లా ఈపూరు. ఇతను కొంతకాలంగా హైదరాబాద్ లోని మాదాపూర్ లోని ప్రైవేటు హాస్టల్స్ లో ఉంటూ మోటివేషనల్ స్పీచ్ లు ఇస్తుంటాడు. క్లాసుల అనంతరం విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే తనతో మాట్లాడొచ్చంటూ తన ఫోన్ నెంబర్ ఇస్తూ గాలం వేస్తాడు.

అతడి మాటలు విని ఆకర్షితులై.. అతడితో మాట్లాడితే మరింత మంచి జరుగుతుందని భావించి ఫోన్ చేసే అమ్మాయిలకు చేదు అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి పరిస్థితిని బయటకు చెప్పుకోలేక.. తమలో తాము కుమిలిపోయేవారు. అసభ్యంగా ప్రవర్తించే ఈ సైకో సైకాలజిస్టు తీరు తాజాగా ఒక ఫిర్యాదు కారణంగా బయటకు వచ్చింది. తనకున్న సందేహాల్ని తీర్చుకోవటం కోసం ఫోన్ చేసిన ఒక అమ్మాయితో.. అసభ్యంగా ప్రవర్తించటంతో పాటు శారీరక వాంఛ తీర్చాలని కోరినట్లుగా ఒక అమ్మాయి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది.

దీంతో.. కేసు నమోదు చేసిన షీ టీమ్ పక్కా ఆధారాలు సేకరించారు. సైకాలజిస్టుగా వ్యవహరిస్తూ అతగాడి చేసే చిల్లర చేష్టల్ని గుర్తించి.. అతడ్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అతగాడి లీలల విన్న న్యాయమూర్తి అతడికి పదహారు రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో అతడ్ని చంచలగూడ జైలుకు తరలించారు. వేధింపులకు గురయ్యే మహిళలు ఎవరైనా సరే.. తమకు ఫిర్యాదు చేయొద్దని షీటీమ్స్ పేర్కొంది. అవసరమైతే ఆన్ లైన్ ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చని.. బాధితుల సమాచారం బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని షీ టీమ్స్ చెబుతోంది. సో.. ఇలాంటి సైకో గాళ్ల లెక్క తేల్చటానికి వీలుగా తమకు ఎదురయ్యే చేదు అనుభవాలకు సంబంధించిన ఒక ఫిర్యాదు ఇవ్వాల్సిన బాధ్యత బాధిత మహిళలు.. విద్యార్థినుల మీద ఉందన్నది మర్చిపోకూడదు.