Begin typing your search above and press return to search.

కోర్టు జోక్యం... ఏపీలో ఆ స్కీం మళ్లీ స్టార్ట్ !?

By:  Tupaki Desk   |   24 Jun 2022 11:30 AM GMT
కోర్టు జోక్యం... ఏపీలో ఆ స్కీం మళ్లీ స్టార్ట్ !?
X
ఎట్ట‌కేల‌కు జ‌గ‌న్ సర్కార్ నేతృత్వంలో విదేశీ విద్య అందుకోనున్నారు బ‌డుగులు. ఇందుకు సంబంధించి జ‌గ‌న్ త్వ‌ర‌లోనే కొత్త విధానం ఒక‌టి ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని హై కోర్టు సాక్షిగా సంబంధిత వ‌ర్గాలు ధ్రువీక‌రించాయి. ఇదే క‌నుక జ‌రిగితే బ‌డుగులకు శుభ‌వార్తే ! వాస్త‌వానికి చంద్రబాబు పెట్టిన రెండు ప‌థ‌కాల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్ కోకోతలు వేశారు.

షాదీ ముబారక్ అంటూ మైనార్టీల‌కు అందించే దుల్హ‌న్-కు, అదేవిధంగా ఎప్ప‌టి నుంచో బ‌డుగుల‌కు అందిస్తున్న విదేశీ విద్యకు! ఈ రెండు ప‌థ‌కాల‌నూ పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండ్లు విప‌రీతంగా వినిపిస్తున్నాయి.

అదేవిధంగా హిందువుల‌కు అందించే క‌ల్యాణ మిత్ర విష‌యంలో కూడా జగ‌న్ మాట త‌ప్పార‌ని వార్త‌లొస్తున్నాయి.పెళ్లిళ్ల వివ‌రాలు న‌మోదు చేస్తే గ‌తంలో ఒక్కో పెళ్లికి సంబంధించి రెండు వంద‌ల యాభై రూపాయ‌ల నుంచి ఐదు వంద‌ల రూపాయ‌లు చెల్లించే వారు. ఇప్పుడు అది కూడా లేదు. చంద్ర‌న్న పెళ్లి కానుక పేరిట ఇచ్చే యాభై వేలు అప్ప‌ట్లో కొన్ని కుటుంబాల‌కు అందాయి.

కానీ ఇప్పుడు అవేవీ లేవు. ఇక విదేశీ విద్య‌కు సంబంధించి కోవిడ్ కార‌ణంగా నిధులు నిలిపివేశామ‌ని సాక్షాత్తూ ప్ర‌భుత్వ‌మే కోర్టుకు విన్నవించింది. 2020-21 సంవ‌త్సరానికి గాను తాము ఈ పథ‌కాన్ని ప‌క్క‌న పెట్టామ‌ని చెబుతోంది. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే కొత్త విధానం ప్ర‌క‌టిస్తోంద‌ని చెబుతోంది. ఇందుకు సంబంధించి హైకోర్టులో మైనారిటీ సంక్షేమ శాఖ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది.

ఇక విదేశీ విద్యను గ‌తంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు అందించేవారు. ఇప్ప‌టిదాకా విదేశీ విద్య సాయం అందుకున్న వారిపై విజిలెన్స్ విచార‌ణ సాగుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోర్టుకు విన్నవించింది. అది పూర్తికాగానే త్వ‌ర‌లోనే కొత్త విధానం ప్ర‌క‌టించి కొత్త ద‌ర‌ఖాస్తులు తీసుకుంటామ‌ని చెబుతోంది.

ఈ ఏడాది ఏప్రిల్ 21న విదేశీ విద్య‌కు సంబంధించిన బ‌కాయిల చెల్లింపుల్లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన‌డంపై, ఈ విధంగా 517 మంది విద్యార్థుల భ‌విష్య‌త్ అగమ్య‌గోచ‌రం కావ‌డంతో ఇంతియాజ్ అనే యాక్టివిస్ట్ కోర్టు ను ఆశ్ర‌యించారు. దీని పై విచారించిన కోర్టు ప్ర‌తివాదుల‌కు నోటీసులు ఇచ్చి, కేసును వ‌చ్చే నెల ఎనిమిదో తారీఖుకు వాయిదా వేసింది.