Begin typing your search above and press return to search.

అమ్మ మీద నోరు జారితే ఎన్ని తిప్పలు?

By:  Tupaki Desk   |   16 Jun 2016 7:19 AM GMT
అమ్మ మీద నోరు జారితే ఎన్ని తిప్పలు?
X
అమ్మగా సుపరిచితురాలైన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై వెనుకా ముందు చూసుకోకుండా విమర్శలు చేసిన దానికి తమిళనాడు కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయధరణి తీవ్ర ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో అమ్మను ఇష్టారాజ్యంగా మాటలు అనేసిన ఆమెపై.. పరువునష్టం దావా వేశారు. ప్రత్యర్థిపై విమర్శలు గుప్పించే సమయంలో జాగ్రత్తగా ఉండాల్సింది. అలాంటివేమీ పట్టించుకోకుండా విమర్శనాస్త్రాల్ని సంధించటంతో జయలలిత తరఫున ప్రభుత్వ న్యాయవాది శేఖరన్ రంగంలోకి దిగారు.

ఇందులో భాగంగా నాగర్ కోయిల్ సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. గతంలో ఈ కేసు విచారణ జరగ్గా.. దీన్ని బుధవారానికి వాయిదా వేశారు. అయితే.. కోర్టుకు హాజరు కావాల్సిన విజయధరణి డుమ్మా కొట్టారు. తన తరఫున తన సహాయకుడ్ని పంపిన ఆమె.. న్యాయవాదులు విధుల బహిష్కరణ చేస్తున్నారని.. కోర్టుకు రావటానికి లాయర్లు అందుబాటులో లేని కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారంటూ వాదించారు. విజయధరణిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.

ఆయన వాదనల నేపథ్యంలో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శశికుమార్ స్పందిస్తూ.. విజయధరణి తరఫున ఆమె సహాయకుడు సమర్పించిన వినతిని రిజెక్ట్ చేయటమే కాదు.. ఆమెను కోర్టులో హాజరు పర్చాలంటూ పీటీ వారెంట్ జారీ చేశారు. ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామాలతో తమిళనాడు కాంగ్రెస్ వర్గాలు షాక్ తిన్న పరిస్థితి. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ.. పీటీ వారెంట్ ఇష్యూ అయిన విజయధరణి పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఆమె కోర్టుకు వెళ్లాలా? ఆసెంబ్లీకి వెళ్లాలా? అన్నది ఒక సమస్యగా మారింది. కోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని.. వాయిదా సమయానికి బుద్దిగా వెళ్లాలన్న విషయాన్ని ప్రముఖులు ఎప్పటికి తెలుసుకుంటారో..?