Begin typing your search above and press return to search.

ఒకసారి ఒప్పుకుంటే.. ప్రతిసారి ఒప్పుకున్నట్లు కాదట!

By:  Tupaki Desk   |   21 March 2021 8:30 AM GMT
ఒకసారి ఒప్పుకుంటే.. ప్రతిసారి ఒప్పుకున్నట్లు కాదట!
X
అవివాహితులైన ఇద్దరి మధ్య ఉండే సంబంధం ఎలా ఉంటుంది? ఒకసారి పరస్పరం ఇష్టపడి చేసిన సెక్సు.. తర్వాత చేసేటప్పుడు సైతం భాగస్వామి ఇష్టం చాలా ముఖ్యమని చెప్పే కేస్ స్టడీగా దీన్ని చెప్పాలి. ముంబయిలోని ఒక ప్రముఖ పత్రికలో పని చేసే శ్రీముఖి (పేరు మార్చాం) అనే జర్నలిస్టు ఢిల్లీలోని ఒక హోటల్లో తనపై అత్యాచారం జరిగినట్లుగా కంప్లైంట్ చేశారు. మెజిస్ట్రేట్ ఎదుట ఆమె తనపై అత్యాచారం జరిగిందని వాంగ్మూలం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం చూసినప్పుడు.. ఫిబ్రవరి 20న ఆమె ఒక కేఫ్ లో కలుసుకున్నారు. తర్వాత అతను రమ్మంతో హోటల్ కు వెళ్లింది. ఆ సమయంలో తన మీద అత్యాచారం జరిగిందని పేర్కొనటంతో.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అయితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వాదన మరోలా ఉంది. తనను కలవటానికే శ్రీముఖి ఫుణె నుంచి వచ్చి హోటల్ రూంలో కలిశారని.. తామిద్దరం పరస్పర అంగీకారంతోనే లైంగిక సంబంధం ఉందని.. తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నిందితుడి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అతడిప్పుడు పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. హోటల్ గదికి వెళ్లి కలిసినంత మాత్రాన లైంగిక సంబంధానికి అంగీకారం తెలిపినట్లు కాదని బాధితురాలి తరఫు లాయర్ వాదనలు వినిపించారు.

అవివాహితుల మధ్య సెక్సు చేసే ప్రతిసారీ ఇరువురి అంగీకారం తప్పనిసరి అని.. ఒకసారి చేశారు కాబట్టి.. ప్రతిసారి చేయటానికి ఒప్పుకున్నట్లు కాదని పటియాలా హౌస్ కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నారు. బాధితురాలి అంగీకారం లేకుండా సెక్సు చేయటం.. అత్యాచారం కిందకు వస్తుందని ఐపీసీ సెక్షన్ 376 కూడా చెబుతుందంటున్నారు.

అయితే.. ఈ ఎపిసోడ్ లో బాధితురాలు చెబుతున్నది ఎంత వరకు నిజం అన్నది కూడా ప్రశ్న. అయితే.. ఒక మహిళ ఆ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి కేసుల్లో నిందితుడి గత చరిత్ర.. అతడి ప్రవర్తన.. పాత కేసుల ఆధారంగా కూడా అతడు చేసిన నేరాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. బాధితురాలి ఇష్టంతోనే తాను సెక్సు చేసినట్లుగా నిరూపించాల్సిన అవసరం నిందితుడి మీద ఉంటుందని చెబుతున్నారు.

ఒకసారి నిందితుడు తన తప్పు లేదని నిరూపించుకోగలిగితే.. తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాల్ని చూపించాల్సిన బాధ్యత బాధితురాలి మీద పడుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసులోని ఇరువురు వాదనలు ఆసక్తికరంగా మారాయి. మరి.. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.