Begin typing your search above and press return to search.

ర‌హ‌స్య జీవోలు - కొన్ని నిజాలు - కోర్టు ఆదేశాలు!

By:  Tupaki Desk   |   14 Sep 2021 10:05 AM GMT
ర‌హ‌స్య జీవోలు - కొన్ని నిజాలు - కోర్టు ఆదేశాలు!
X
ప్ర‌జ‌ల ద్వారా ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వాలు.. ఇచ్చే ఆదేశాల(జీవో)పై ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. అయితే.. దుర‌దృష్ట‌వ శాత్తు.. ఏపీలో జ‌రుగుతున్న విష‌యంపైనే మీడియా దృష్టి పెట్టింది. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం నుంచి యూపీ, ఢిల్లీ, ప‌శ్చిమ బెంగాల్‌, కేర‌ళ, తెలంగాణ‌ స‌హా అనేక రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ఇటీవ‌ల కాలంలో ర‌హ‌స్యంగానే జీవోల‌ను ఇస్తున్నాయి. లేదా.. ఇచ్చిన వాటిని బ‌హిర్గ‌తం చేయ‌కుండా దాస్తున్నాయి. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని.. ఆయా ప్ర‌భుత్వాలు చెబుతున్నాయి.

వాస్త‌వానికి ప్ర‌భుత్వానికి-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య దాప‌రికం ఎందుకు ? అనేది న్యాయ స‌మ్మ‌త‌మైన ప్ర‌శ్న‌. ఇదే ఇప్పుడు కోర్టుల్లో ప్ర‌బుత్వాల‌ను బోను ఎక్కిస్తోంది. ఏ విష‌యంపైనైనా.. దాప‌రికంగా లేకుండా.. జీవోలు ఇవ్వొచ్చు క‌దా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అయితే.. ప్ర‌భుత్వాలు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణ‌యాలు వివాదాల‌కు దారితీయ‌డ‌మో.. లేక‌.. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించ‌డ‌మో.. చేస్తాయ‌నే కార‌ణంగా.. ర‌హ‌స్యంగా ఉంచ‌డం.. ఇటీవ‌ల కాలంలో ప్ర‌భుత్వాల‌కు అల‌వాటుగా మారింది. మ‌రికొన్ని.. ప్ర‌భుత్వాల‌పై విమ‌ర్శ‌ల‌ను, వ్య‌తిరేక‌త‌ను పెంచుతాయ‌నే ఉద్దేశంతో కూడా దాస్తున్న సంద‌ర్భాలు ఉంటున్నాయి.

కేంద్ర ప్ర‌భుత్వాన్ని తీసుకుంటే.. పెట్రోల్ స‌హా స‌హ‌జ వాయు ఉత్ప‌త్తుల‌పై నియంత్ర‌ణ ఉందా? లేదా? ప్రైవేటు చ‌మురు కంపెనీల‌కు ధ‌ర‌లు పెంచుకునే వెసులుబాటు క‌ల్పించేలా .. జీవో ఇచ్చారా? లేదా? అనేది ఇప్ప‌టికీ.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఇదే విష‌యంపై బీజేపీ ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి.. ఇటీవ‌ల స్పందిస్తూ.. `ఇది ర‌హ‌స్య జీవో.. జీవో లేకుండా.. కంపెనీలు ఎలా పెంచుతాయి!` అని స‌మాధానం ఇచ్చారు. అప్ప‌ట్లో ఒక‌టి రెండు రోజులు మీడియా హ‌డావుడి చేసింది. త‌ర్వాత మామూలై పోయింది.

ఇక‌, యూపీ ప్ర‌భుత్వం కూడా అనేక జీవోల‌ను ర‌హ‌స్యంగానే ఉంచింద‌ని.. ఇటీవ‌ల అక్క‌డి హైకోర్టు కూడా ఆక్షేపించింది. తెలంగాణ స‌ర్కారు ద‌ళిత బంధు విష‌యంలో ర‌హ‌స్యంగా జీవోను దాచ‌డంపై హైకోర్టు మండిప‌డింది. ఇక‌, ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం వంతు వ‌చ్చింది అంతే! అయితే.. ఇక్క‌డ ర‌హ‌స్య జీవోలు అనేవి.. కొత్త కాదు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన చంద్ర‌బాబు కరెంటు బిల్లులు పెంచుతూ.. ఇచ్చిన జీవో దాదాపు 40 రోజ‌లు త‌ర్వాత‌.. బ‌య‌ట ప‌డి.. తీవ్ర స‌మ‌స్య‌కు దారి తీసి.. ప‌లువురు ప్రాణాలు కోల్పోయేలా చేసింది.

కిర‌ణ్ కుమార్ రెడ్డి హ‌యాంలోనూ అత్యంత స్వ‌ల్ప కాలంలోనే ర‌హ‌స్య జీవోలు ఇచ్చార‌ని అప్ప‌ట్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు విమ‌ర్శించారు. సో.. మ‌న ఏపీకి కూడా ర‌హ‌స్య జీవోలు కొత్త‌కాదు. అయితే.. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప్ర‌తిప‌క్షాల‌కు ఇది అందివ‌చ్చిన వ‌రంగా మారింది అంతే! అంటున్నారు వైసీపీ నాయ‌కులు. అయితే.. ఇక్క‌డ గత ప్రభుత్వాల హయాంలో తెరపైకి వచ్చిన జీవోఐఆర్ డాట్ ఏపీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్ సైట్ ను వైసీపీ సర్కార్ కొనసాగించింది.

అయితే ఈ మధ్య వివిధ కారణాలతో ఆ వెబ్ సైట్ ను నిలిపేస్తూ ఇకపై జీవోలు బహిర్గతం చేయబోమని తేల్చిచెప్పేసింది. అంతే కాదు వివిధ ప్రభుత్వ శాఖలకూ తమ ఉత్తర్వులు అంతర్గతంగా మాత్రమే విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చేసింది. దీంతో ఈ వ్యవహారం గవర్నర్ కు చేరింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ దీనిపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ఏపీలోనూ కొంద‌రు ఈ ర‌హ‌స్య జీవోల‌పై హైకోర్టుకు వెళ్లారు. దీంతో ర‌హ‌స్య జీవోల‌పై రాష్ట్ర స‌ర్కారును హైకోర్టు నిల‌దీసింది.


ఈ సమయంలో అధికారుల సూచన మేరకు కొత్త వెబ్ సైట్ ను ప్రారంభించారు. దీనికే `ఏపీ ఈగెజిట్` అని పేరు పెట్టారు. ఇందులో జీవోలు పెట్టడం మొదలు పెట్టారు. అత్యంత రహస్యం, రహస్యం, గోప్యం పేరుతో మూడు కేటగిరీల్లో రహస్య జీవోలు ఉంటాయని, వాటిని మాత్రం వెబ్ సైట్ లో పెట్టబోమని ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పేసింది. దీనిపై మళ్లీ అభ్యంతరాలు మొదలయ్యాయి. దీనిని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అసలు రహస్య జీవోలంటే ఏంటని సర్కార్ ను ప్రశ్నించింది. బిజినెస్ రూల్స్ ప్రకారమే తాము జీవోల్ని రహస్యంగా పెడుతున్నట్లు ప్రభుత్వం చేసిన వాదనను సైతం హైకోర్టు అంగీకరించలేదు.

ఎప్పుడో చేసిన చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటామంటే ఎలా అని ప్రశ్నించింది. కాలంతో పాటు మారాలని సూచించింది. ప్రభుత్వం రహస్య జీవోల దాపరికంపై జారీ చేసిన జీవోను సైతం పిటిషనర్లకు ఇవ్వాలని ఆదేశించడంతో పాటు తాజా వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే.. ర‌హ‌స్య జీవోల వ్య‌వ‌హారం దేశ‌వ్యాప్తంగా ఉన్న‌దేన‌ని.. క‌రోనా స‌మ‌యంలో ఇలాంటి జీవోలు చాలానే వెలుగు చూశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.