Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పిటిష‌న్ ను కొట్టేసిన కోర్టు

By:  Tupaki Desk   |   18 Jan 2020 6:06 AM GMT
జ‌గ‌న్ పిటిష‌న్ ను కొట్టేసిన కోర్టు
X
సీబీఐ కేసులు విచార‌ణ‌లో నేరం రుజువు అయితేనే.. ఈడీ కేసుల‌కు అవ‌కాశం ఉంటుంది.. కాబ‌ట్టి, ముందు సీబీఐ కేసుల‌ను విచారించాల‌ని, త‌ర్వాతే ఈడీ కేసుల‌ను విచారించాల‌ని కోరుతూ సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున దాఖ‌లైన పిటిష‌న్ ను ఆ న్యాయ‌స్థానం కొట్టి వేసింది. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై సీబీఐ కొన్నేళ్ల కింద‌ట కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే జ‌గ‌న్ మీద కాంగ్రెస్ - టీడీపీ నేత‌లు సీబీఐ విచార‌ణ‌ను కోరుతూ లేఖ‌లు రాయ‌డం, ఆ వెంట‌నే సీబీఐ విచార‌ణ షురూ అయిపోవ‌డం జ‌రిగింది. అప్ప‌టి అధికార ప‌క్షానికి వ్య‌తిరేకంగా వెళ్లినందుకు జ‌గ‌న్ ఆ కేసుల‌ను ఎదుర్కొంటూ ఉన్నారు. వాటిల్లో ప‌ద‌హారు నెల‌లు జైల్లో కూడా ఉండి వ‌చ్చారు.

ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో అఖండ మెజారిటీతో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే సీబీఐ కేసుల త‌ల‌నొప్పి మాత్రం జ‌గ‌న్ ను వ‌ద‌ల‌డం లేదు. ఈ క్ర‌మంలో కొన్ని లాజిక‌ల్ అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని కోర్టు వ‌ద్ద‌కు వెళ్లినా అక్క‌డ మాత్రం జ‌గ‌న్ కు సానుకూల‌త వ్య‌క్తం కావ‌డం లేదు.

సీబీఐ వి అక్ర‌మ కేసులు అని జ‌గ‌న్ మొద‌టి నుంచి చెబుతున్నారు. సీబీఐ వివిధ సెక్ష‌న్ల కింద మోపిన కేసుల్లో అస‌లు ప‌స లేద‌ని అనేక మంది ప్ర‌ముఖులు వ్యాఖ్యానించారు. చ‌ట్ట‌ప‌ర‌మైన‌, న్యాయ‌ప‌ర‌మైన నిపుణులు చాలా మంది ఈ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. అయితే సీబీఐ న‌మోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ కూడా జ‌గ‌న్ పై కేసులు పెట్టింది. వాటి విచార‌ణ కూడా సాగుతూ ఉంది. వాస్త‌వానికి సీబీఐ కేసులు ఇప్ప‌టి వ‌ర‌కూ రుజువు కాలేదు. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి విచార‌ణ కొన‌సాగుతూనే ఉంది. అయితే సీబీఐ ఇంత వ‌ర‌కూ ఏ కేసునూ రుజువు చేయ‌లేక‌పోయింది. అనేక మంది డిశ్చార్జి పిటిష‌న్ల‌ను దాఖ‌లు చేసి ఈ కేసుల నుంచి బ‌య‌ట పడ్డారు. అయితే జ‌గ‌న్, విజ‌య‌సాయి రెడ్డి త‌దిత‌రులు మాత్రం కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

ఈ క్ర‌మంలో సీబీఐ కేసులు నిజ‌మ‌ని తేలాకే.. నేర‌మంటూ ఏదైనా జ‌రిగిన‌ట్టు అని, అప్పుడు ఈడీ కేసుల‌ను విచారించాల‌ని జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టును కోరారు. కానీ.. కోర్టు మాత్రం ఆ లాజిక్ తో ఏకీభించ‌లేదు. సీబీఐ - ఈడీ కేసుల విచార‌ణ జాయింటుగా కొన‌సాగాల్సిందే అని కోర్టు స్ప‌ష్టం చేసింది. మ‌రి ఈ పిటిష‌న్ పై జ‌గ‌న్ పై కోర్టును ఆశ్ర‌యిస్తారేమో చూడాల్సి ఉంది.