Begin typing your search above and press return to search.

బహిరంగ మార్కెట్లోకి కొవాగ్జిన్. కొవిషీల్డ్.. రేటు ఎంతంటే?

By:  Tupaki Desk   |   27 Jan 2022 3:56 AM GMT
బహిరంగ మార్కెట్లోకి కొవాగ్జిన్. కొవిషీల్డ్.. రేటు ఎంతంటే?
X
కరోనా మహమ్మారికి చెక్ చెప్పే కొవాగ్జిన్.. కొవిషీల్డ్ రెండు టీకాలు బహిరంగ మార్కెట్లోకి వచ్చేయనున్నాయి. ఇంతకాలం ప్రభుత్వం.. ఆసుపత్రుల్లో మాత్రమే లభ్యమయ్యే ఈ టీకాల్ని మందుల షాపుల్లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోన్నారు. దీనికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ త్వరలో వెల్లడించనుందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్ డోసు రూ.1200 ఉంటే.. కొవిషీల్డ్ రూ.780గా ఉంటోంది. దీనికి రూ.150 అదనంగా సర్వీసు ఛార్జీగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దేశీయంగా డెవలప్ చేసిన ఈ రెండు టీకాల్ని అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. దీని స్థానంలో కొన్ని షరతులకు లోబడి.. బహిరంగ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని.. ఈ రెండు టీకాల్నితయారు చేసిన సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కొవాగ్జిన్.. కొవిషీల్డ్ లను రూ.275లుగా ధరను డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. కాకుంటే మరో రూ.150 సర్వీసుల ఛార్జి కింద చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. ఒక్కో డోసు రూ.425లకు లభ్యమవుతుందన్న మాట.

గత ఏడాది జనవరి 3న ఈ రెండు టీకాల్ని కేంద్రం అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన పిమ్మట.. బహిరంగ మార్కెట్లోకి అమ్మకాలకు వీలుగా అనుమతులు జారీ చేసేందుకు అధికార వర్గాలు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత జోరుగా జరగటం ఖాయమని చెప్పక తప్పదు.