Begin typing your search above and press return to search.

కొవాగ్జిన్ కి మళ్లీ నిరాశే ..నవంబర్ 3న డబ్ల్యూహెచ్ఓ తుది నిర్ణయం !

By:  Tupaki Desk   |   27 Oct 2021 7:54 AM GMT
కొవాగ్జిన్ కి మళ్లీ నిరాశే ..నవంబర్ 3న డబ్ల్యూహెచ్ఓ  తుది నిర్ణయం !
X
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) అనుమతులు లభించడంలో జాప్యం జరుగుతోంది. కొవాగ్జిన్ కు సంబంధించి అదనపు సమాచారం కావాలంటూ డబ్ల్యూహెచ్ ఓ కు చెందిన సాంకేతిక సలహా సంఘం భారత్ బయోటెక్ ను కోరింది. కొవాగ్జిన్ కు అనుమతుల జారీ ప్రక్రియ తుది అంకంలో ఉన్నట్టు డబ్ల్యూహెచ్ ఓ వర్గాలు వెల్లడించాయి. నవంబరు 3న సమావేశం కానున్న డబ్ల్యూహెచ్ ఓ సాంకేతిక సలహా సంఘం కొవాగ్జిన్ పై తుది నిర్ణయం తీసుకోనుంది.

అత్యవసర వినియోగ జాబితాలో తమ వ్యాక్సిన్ ను కూడా చేర్చాలంటూ భారత్ బయోటెక్ ఈ ఏడాది ఏప్రిల్ 19న డబ్ల్యూహెచ్ ఓ కు దరఖాస్తు చేసుకుంది. డబ్ల్యూహెచ్ఓ ఓ అనుమతులు లభిస్తే కొవాగ్జిన్ ను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగించే వీలుంటుంది. అదే సమయంలో కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న భారతీయులు పలు దేశాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా వెళ్లవచ్చు. ఆరు నెలల నుంచి ఏదో ఒక కారణంతో అనుమతిలో జాప్యం జరుగుతోంది. గతంలో పలు కొర్రీలు వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. తాజాగా మంగళవారం జరిగిన సమావేశంలో కొవాగ్జిన్ టీకాకు సంబంధించి భారత్ బయోటెక్‌ను మరింత స్పష్టత కోరింది.

మంగళవారం జరిగిన సమావేశంలో కొవాగ్జిన్‌ ను ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్‌ లో చేర్చడం సమీక్షించినట్టు డబ్ల్యూహెచ్‌ ఓ పీటీఐ అడిగి ఓ ప్రశ్నకు ఈ మెయిల్ ద్వారా స్పష్టతనిచ్చింది. అక్టోబరు 26న సాంకేతిక సలహా బృందం సమావేశమయ్యింది. కొవాగ్జిన్‌ కు సంబంధించి టీకా తయారీదారుల నుంచి అదనపు స్పష్టత కోరింది. దీని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ వినియోగం వల్ల ప్రయోజనాలకు సంబంధించి ఈయూఎల్‌ పై తుది నిర్ణయం తీసుకోంది. ఉత్పత్తిదారు నుంచి ఈ వారంతంలో సమాధానం వస్తుందని ట్యాగ్ భావిస్తోంది, వీటి ఆధారంగా నవంబరు 3న బుధవారం తుది నిర్ణయం తీసుకోనుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డబ్ల్యూహెచ్ ఓ, అధికార ప్రతిని డాక్టర్ మార్గరెట్ హ్యారిస్ మాట్లాడుతూ కొవాగ్జిన్‌ ను అత్యవసర వినియోగం జాబితాలో చేర్చే విషయమై భారత్ బయోటెక్ సమర్పించిన డేటాను సాంకేతిక సలహా బృందం సమీక్షించిందని వెల్లడించింది.