Begin typing your search above and press return to search.

పెరగనున్న కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   21 April 2021 12:30 AM GMT
పెరగనున్న కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం తెలిస్తే షాకే
X
కరోనా కేసులు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాకెట్ స్పీడ్ తో దూసుకెళుతున్న కేసుల నమోదు తీవ్రత చూస్తే.. ఇప్పటివరకు ఉన్న అంచనాల్ని తలదన్నేలా కేసుల సంఖ్య చేరుకుంటుందని చెబుతున్నారు. ఇరవై రోజుల్లో వచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఒకప్పుడు లక్ష లోపే ఉన్న రోజువారీ కేసుల నమోదు.. ఈ రోజు రోజుకు 2.7 లక్షలకు చేరుకోవటం.. రానున్న రోజుల్లో ఈ కేసుల నమోదు మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు.

కేసుల తీవ్రత ఇలా ఉంటే.. వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది. ఇప్పటికి కోవీ షీల్డ్ టీకా లభిస్తోంది కానీ.. కోవాగ్జిన్ మాత్రం లభించని దుస్థితి. ఇలాంటివేళ.. తాజాగా ఒక తీపికబురును అందించింది భారత్ బయోటెక్. తమ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచబోతున్న విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 4 మిలియన్ల కోవాగ్జిన్ డోసుల్ని ఉత్పత్తి చేస్తుందీ సంస్థ. అంటే.. సంవత్సరానికి 48 మిలియన్ల టీకాల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యమే ఉంది.

అందుకు భిన్నంగా ఏడాదికి 700 మిలియన్లు కోవాగ్జిన్ టీకాల్ని ఉత్పత్తి చేసేందుకు వీలుగా తన సామర్థ్యాన్ని విస్తరించినట్లుగా పేర్కొంది. నిన్ననే (సోమవారం) భారత సర్కారు భారత్ బయోటెక్ కు రూ.1500 కోట్లను అడ్వాన్సుగా చెల్లించటం తెలిసిందే. తమ టీకాను కేంద్రానికి ఇచ్చేందుకు ఈ భారీ మొత్తాన్ని ప్రకటించింది. హైదరాబాద్.. బెంగళూరుల్లోని తమ ప్లాంట్లలో వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారు.

అంటే.. ఇప్పటివరకు నెలకు 4 మిలియన్లు (40 లక్షల) వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం ఉన్న భారత్ బయోటెక్.. అతి త్వరలో నెలకు 58 మిలియన్లు (5.8కోట్ల)వ్యాక్సిన్లను తయారు చేయనుంది. అంటే.. ప్రస్తుత సామర్థ్యంతో పోలిస్తే.. దాదాపు 15 రెట్లుగా చెప్పాలి. ఈ దెబ్బతో కోవాగ్జిన్ కొరత తీరనుందని చెప్పాలి. భారత్ బయోటెక్ చెప్పిన మాట సంతోషాన్ని కలిగించేలా ఉన్నా.. ఇదేదో.. ఇంతకు ముందే చేసి ఉండి ఉంటే.. ఈ రోజున దేశం కరోనా కోరలకు చిక్కి ఇంతలా విలవిలలాడేది కాదు కదా?