Begin typing your search above and press return to search.

18-44ఏళ్ళ మధ్య వయస్సు వారికే కోవాగ్జిన్ టీకా ... రెండో డోసు మాత్రమే !

By:  Tupaki Desk   |   7 Jun 2021 8:30 AM GMT
18-44ఏళ్ళ మధ్య వయస్సు వారికే కోవాగ్జిన్ టీకా ... రెండో డోసు మాత్రమే !
X
కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరత కారణంగా ఢిల్లీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ విధానంలో కొత్త పంథా ఫాలో అవుతుంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్సు వారిలో రెండో డోసు అవసరమైనవారికే కోవాగ్జిన్ టీకామందు ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మొదటి విడత తీసుకోవలసినవారిని తిప్పి పంపివేయాలని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను, నర్సింగ్ హోమ్ లను ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు. మా వద్ద ఈ టీకామందు స్టాక్ లేదు. దీనివల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం అని వారు చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా స్టాక్ లేదని, ఈ కారణంగా మొదటి డోసు తీసుకోగోరేవారికి ఛాన్స్ లేదని అంటున్నారు.

ముఖ్యంగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఓ వ్యూహాన్ని పాటించాలని ఢిల్లీ హైకోర్టు గతవారం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించింది. ఈ వ్యాక్సినేషన్ విధానంలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయంటూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఈ సూచన చేసింది. గత మే నెలలో మొదటి డోసు తీసుకున్నవారు ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. 18-44 ఏళ్ళ మధ్య వయస్కులు వ్యాక్సిన్ తీసుకోవడానికి 100 నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న మీరట్, బులంద్ షహర్ వంటి జిల్లాలకు కూడా వెళ్తున్నారని ఆప్ ఎమ్మెల్యే అతిషి తెలిపారు. కాగా వ్యాక్సినేషన్ పాలసీని కేంద్రం సమర్థించుకోగా.. ఇందులో ఎన్నో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. రెండు వారాల్లోగా ఈ పాలసీపై తమ నూతన వైఖరి తెలియజేయాలని సూచించింది. ఇప్పటికే నగరంలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ చాలాసార్లు కేంద్రం దృష్టికి తెచ్చారు.