Begin typing your search above and press return to search.

కొడాలి నానికి టీడీపీలో కోవర్టులు: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   2 Nov 2022 6:52 AM GMT
కొడాలి నానికి టీడీపీలో కోవర్టులు: టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు!
X
కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కొడాలి నానికి కోవర్టులు ఉన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు గుడివాడ నియోజకవర్గంలో కలకలం రేపాయి. నియోజకవర్గం టీడీపీలో కొడాలి నానికి కోవర్టులు ఉన్నారని.. వారే ప్రతి మూడు నెలలకోసారి నియోజకవర్గానికి టీడీపీ తరఫున కొత్త అభ్యర్థి వస్తారంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాగా రావి వెంకటేశ్వరరావు 2009 ప్రజారాజ్యం పార్టీ తరఫున, 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి కొడాలి నానిపై ఓడిపోయారు. 2019లో గుడివాడ నుంచి టీడీపీ తరఫున దేవినేని అవినాష్‌ పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజులకే దేవినేని అవినాష్‌ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మరోమారు రావి వెంకటేశ్వరరావు టీడీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.

కాగా ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేసే కొడాలి నానిని ఈసారి ఎలాగైనా ఓడించాలని ఇటు టీడీపీ, అటు జనసేన కంకణం కట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా గుడివాడలో పోటీ చేసే అభ్యర్థి ఈయనేనంటూ పలువురి పేర్లు తెరపై కొచ్చాయి. దగ్గుబాటి పురందేశ్వరి, బాలకృష్ణ, ఒక ఎన్నారై ఇలా పలువురి పేర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే రావి వెంకటేశ్వరరావు తాజా వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. గుడివాడ నియోజకవర్గం టీడీపీలో కొడాలి నానికి కోవర్టులు ఉన్నారని.. వారే ఇలాంటి పేర్లను ప్రచారంలో పెడుతున్నారని మండిపడ్డారు. తద్వారా తెలుగుదేశం పార్టీ శ్రేణులను గందరగోళపరచడమే కోవర్టుల ఉద్దేశమని రావి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.

గుడివాడలో పటిష్టంగా ఉన్న టీడీపీని చెడగొట్టే ప్రయత్నాలను కోవర్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రతి మూడు నెలలకు ఒకసారి టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు వీరేనంటూ కొంతమంది టీడీపీ కోవర్టులు కొన్ని పేర్లు ప్రచారంలో పెడుతున్నారని నిప్పులు చెరిగారు.

గత 20 ఏళ్లుగా గుడివాడలో టీడీపీ కోవర్టులు ఇదే పనిచేస్తున్నారని.. కొడాలి నానితో చేతులు కలిపి టీడీపీని నాశనం చేస్తున్నారని రావి వెంకటేశ్వరరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ నేపథ్యంలో కోవర్టులను గుర్తించి వారందర్ని పక్కన పెట్టామని తెలిపారు. పార్టీకి ద్రోహం చేసేవారు ఎవరైనా వారిని దూరం పెడతామని హెచ్చరించారు. కోవర్టు నేతల తప్పుడు ప్రచారాలను టీడీపీ కార్యకర్తలెవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన భరోసాతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 2024లో తానే పోటీ చేస్తానని.. అందరి సహకారంతో విజయం సాధిస్తానని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.